`రాజావారు రాణీగారు` సినిమాతో ఆకట్టుకున్నాడు.. కిరణ్ అబ్బవరపు. కుర్రాడిలో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయన్న సంగతి అందరికీ అర్థమైంది. ఆ తరవాత ఆఫర్లు వరుస కట్టాయి. తన రెండో సినిమా `ఎస్.ఆర్.కల్యాణమండపం` ఈరోజు (ఆగస్టు 6న) రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కథ అందించింది కూడా హీరోనే. నిజానికి ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు చాలా వరుస కట్టాయి. మంచి రేట్లు ఇస్తామన్నాయి. కానీ… ఈ సినిమాపై అత్యంత విశ్వాసంతో.. ఏ బేరానికీ లొంగలేదు నిర్మాతలు. ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేస్తాం అని పట్టుపట్టుకుని కూర్చున్నారు. వాళ్ల కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవాల్సిందే.
అయితే హీరో కూడా తక్కువ తినలేదు. చివర్లో.. నిర్మాతలు కాస్త తగ్గి ఓటీటీకి ఇచ్చేద్దాం అన్నా.. కిరణ్ ఒప్పుకోలేదు. ఆగస్టు 6న రిలీజ్ డేట్ ప్రకటించాక, పరిస్థితులు చాలా మారాయి. ఏపీలో థియేటర్లు లేవు. కొద్దో గొప్పో తెరచుకున్నా – అక్కడ 50 శాతం ఆక్యుపెన్సీనే. పైగా నైట్ షోలు ఉండవు. అయినా కూడా.. కిరణ్ తగ్గలేదట. పైగా `ఫ్యాన్స్ షో వేస్తే ఎలా ఉంటుంది` అని నిర్మాతల్ని ఆరా తీసినట్టు సమాచారం. ఈ సినిమా ప్రమోషన్లన్నీ తానే దగ్గరుండి చూసుకున్నాడు. మెట్రో రైలెక్కి మరీ పాంప్లేట్లు పంచిపెట్టాడు. ఇవన్నీ ఓకే. శుక్రవాం ఉదయం ప్రసాద్ ఐమాక్స్ లో.. 8.45 షోకి.. తన సొంతూరు కడప నుంచి.. వందమంది కుర్రాళ్లని దిగుమతి చేసి, గోల గోల చేయించాడు. కిరణ్ కనిపించిన ప్రతీ షాట్ కీ, తన ఎలివేషన్స్కి తెర ముందుకొచ్చి డాన్సులు చేయడం, అరచి గోల పెట్టడం – ఆ కుర్రాళ్ల పని. ఓ స్టార్ హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్లు..అన్నీ తనపై డిజైన్ చేయించుకుని, ఓ ఫ్యాన్స్ గ్రూప్ ని తానే సృష్టించుకుని – తనకు తానే హంగామా చేసుకోవడం… అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా.. ఈతరంలో నిలదొక్కుకోవాలంటే ఇన్ని తెలివితేటలు చూపించాల్సిందేనేమో..? మొత్తానికి ఓటీటీ ఆఫర్లని దాటుకుని థియేటర్ల ముందుకొచ్చిన కల్యాణ మండపానికి రిజల్ట్ ఏమిటో? తన కాన్ఫిడెన్స్ ఖరీదెంతో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాలి.