రేటింగ్: 2.5
నేతి బీరకాయలో నెయ్యి ఉండదు కదా … అలా ఇందులో కూడా కళ్యాణమండపం కనిపించదు. బోర్డ్ కనిపిస్తుందంతే. ఇందులో పెళ్లిళ్లు జరగవు. ఊరేగింపులు కనిపిస్తాయంతే. హీరో బిల్డప్ సీన్స్‌పై పెట్టినంత దృష్టి కథకి కావల్సిన విషయాలపై పెట్టకపోతే ఏం జరుగుతుందో ఉదాహరణగా నిలిచే మరో చిత్రమిది.
రాయచోటిలోని ఎస్.ఆర్.కళ్యాణమండపం అది. నిత్య కళ్యాణం… పచ్చతోరణాలతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వైభవం. కానీ ఆ మండపం నిర్మించిన పెద్దాయన చనిపోయాక పరిస్థితులు మారిపోతాయి. కొడుకు ధర్మ (సాయికుమార్) పగ్గాలు చేపట్టాక మండపం కళ తప్పిపోతుంది. అందులో పెళ్లిళ్లు జరగవు. ధర్మ తాగుతూ కూర్చుంటాడంతే. చివరికి దాన్ని తాకట్టు కూడా పెట్టేస్తాడు. అది తెలిశాక ధర్మ కొడుకు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తన చదువుని ఆపేసి కళ్యాణమండపం బాధ్యతలు చూసుకోవడానికి వస్తాడు. మరి ఆ కుర్రాడు వచ్చాక అందులో పెళ్లిళ్లు జరిగాయా? పూర్వ వైభవం తిరిగొచ్చిందా? తండ్రి ధర్మతో కళ్యాణ్ పదేళ్లుగా మాట్లాడకపోవడానికి కారణమేమిటి? అనేదే సినిమా.
పెళ్లికి అందరూ వచ్చారు. వధూవరులు పెళ్లి దుస్తుల్లో ధగ ధగ మెరిసిపోతున్నారు. ముహూర్తానికి సమయం దగ్గరపడింది. కానీ మండపంలో భజంత్రీలే మోగడం లేదు. ఈ సినిమా పరిస్థితి కూడా అంతే. మంచి కథనైతే రాసుకున్నారు. అందులో తగుపాళ్లలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించారు. యువతరం ప్రేక్షకుల అభిరుచులకి తగినట్టుగా మాటలు కూడా రాసుకున్నారు. కానీ స్క్రీన్ప్లేపైనే సరిగ్గా దృష్టిపెట్టలేదు. దాంతో కళ్యాణమండపం కళ కోల్పోయింది. కథకి ఏయే అంశాలు కీలకమో అవే తక్కువయ్యాయి. హీరో కళ్యాణమండపం బాధ్యతలు తీసుకుంటాడు. అది తెలిసి వాళ్ల కాలేజీ ప్రిన్సిపల్ ఓ జంటకి పెళ్లి చేసే బాధ్యతని అప్పజెబుతాడు. ఆ టాస్క్ హీరోకి ఓ ఛాలెంజ్ కావాలి. అందులో కావల్సినంత డ్రామాని జోడించొచ్చు. కానీ ఆ సన్నివేశాల్ని ఫన్నీగా మార్చేశారు. ఈ మాత్రం దానికే అన్నట్టుగా ఉంటాయి ఆ సన్నివేశాలు చూశాక. అప్పట్లో పెళ్లిళ్లు ఎలా జరిగేవో తెలుసా? అంటూ ఓ పెద్ద లెక్చర్ ఇస్తాడు హీరో. ఇతని గత వైభవాన్ని గుర్తు చేసేలా పెళ్లిళ్లు చేస్తాడేమో అని ఊహిస్తే తీరా తీరా పెళ్లి బారాత్‌ని చూపించి, అందులో హీరో అతని మిత్రబృందం డ్యాన్సులేసేసి `ఇదీ తాను పెళ్లి చేసే విధానం` అనిపిస్తాడు. హీరోయిజంపై దృష్టిపెట్టినంతగా కథకి అవసరమైన విషయాలపై దృష్టిపెట్టలేదు. కనీసం పెళ్లి మండపం వాతావరణాన్ని కూడా ఈ సినిమాలో చూపించలేకపోయారు. ప్రథమార్థమైనా కాలేజీ నేపథ్యం, హీరో అతని మిత్రబృందం చేసే సందడి, హీరో కుటుంబ సన్నివేశాలతో పర్వాలేదనిపిస్తుంది కానీ… ద్వితీయార్థమే మరీ సాగదీతలా మారింది. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకథ ఏమాత్రం పండలేదు. తండ్రీ కొడుకుల బంధం థ్రెడ్ నుంచైనా భావోద్వేగాల్ని పండించాల్సి ఉండగా…అందులోనూ ఫలితం రాబట్టలేకపోయారు. పదేళ్లుగా తండ్రితో మాట్లాడటం లేదంటే, దాని వెనక ఏదో ఉంటుందని ఊహిస్తారంతా. తీరా హీరో చెప్పిన కారణం విన్నాక, `ఈ మాత్రం దానికేనా?` అనిపించకమానదు. కడపజిల్లా రాయచోటి నేపథ్యం కావడంతో రాయలసీమ యాస ఈ కథకి కీలకం. అయితే కథానాయకుడు మినహా మిగిలిన పాత్రలేవీ ఆ యాస మాట్లాడకపోవడంతో కనెక్టివిటీ కూడా కోల్పోతుంది. ఇలా ఏ దశలోనూ ప్రేక్షకులకి కనెక్ట్ కాదీ చిత్రం.
నటీనటుల్లో సాయికుమార్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. ఆయన ఓ పెద్దింట్లో పుట్టి… వ్యాపారంలో నష్టాలు ఎదుర్కుంటున్న వ్యక్తిగా చక్కటి భావోద్వేగాలు పండించారు. కిరణ్ అబ్బవరంకి రెండో సినిమా అయినా కూడా చాలా బాగా నటించారు. కళ్యాణ్ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన రాయలసీమ యాస కూడా బాగుంది. తులసి, అయ్యంగార్ మినహా మిగిలిన పాత్రలు కానీ, ఆ పాత్రలలో నటించిన నటులు కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదపిపిస్తుంది. పాటలు చిత్రీకరణ, సంగీతం ఆకట్టుకుంటాయి. కెమెరా పనితనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు మరీ నాసిరకంగా ఉన్నాయి. కళ్యాణమండపం అంటే బోర్డ్ మినహా మరేమీ చూపించరు. దర్శకుడు ఈ కథపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కథ, మాటల రచయితగా కూడా కిరణ్ అబ్బవరం మెప్పిస్తాడు.
మంచి కథ, మంచి నేపథ్యం కుదిరినా.. దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా తెరకెక్కించిన చిత్రమిది. అక్కడక్కడా కొంచెం కామెడీ, అక్కడక్కడా కొన్ని భావో్ద్వేగాలతో సరిపెట్టే చిత్రమిది. హీరోయిజం మాత్రం బోలెడంత ఉంది. రెండో సినిమానే చేస్తున్న కిరణ్ అబ్బవరంని ఆ రేంజి హీరోయిజంలో చూడటం కష్టమే.
* ఫినిషింగ్ టచ్: మండపం వెలవెల… ప్రేక్షకులు విలవిల
రేటింగ్: 2.5