ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా చెబుతూ వస్తున్న శ్రవణ్ రావు సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ వచ్చారు. పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆయనను పోలీసులు ఆరు గంటల పాటు ప్రశ్నించి పంపేశారు. మళ్లీ పిలుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికైతే ఆయనకు అరెస్టు నుంచి రక్షణ ఉంది. సుప్రీంకోర్టు నుంచి రిలీఫ్ పొందిన వెంటనే ఆయన ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రశ్నించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం.. విచారణకు సహకరించాలని ఆదేశించడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు
పోలీసుల నోటీసులకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉండటంతో ఆయన ఉదయమే హైదరాబాద్ లో దిగిపోయారు. వెంటనే పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఐ న్యూస్ చానల్ యజమానిగా ఉన్న ఆయన ట్యాపింగ్ విషయంలో కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు. సర్వర్ ఐ న్యూస్ ఆఫీసులోనే పెట్టారని పోలీసు అభియోగం. వీటన్నిటితో పాటు ట్యాపింగ్ పరికరాలను సేకరించడం దగ్గర నుంచి ఇతర విషయాలపై ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన ఏం సమాధానం ఇచ్చారో స్పష్టత లేదు.
మరో నిందితుడు ప్రభాకర్ రావు కూడా ముందస్తు బెయిల్ ఇస్తే తాను కూడా విచారణకు హాజరవుతానని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ వాయిదా పడింది. రిలీఫ్ లభిస్తే ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరిపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు. రిస్క్ ఎందుకని ఇక్కడకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రవణ్ రావు ఏదైనా కీలక సమాచారం ఇచ్చి ఉంటే.. ట్యాపింగ్ కేసులో మరో అడుగు ముందుకు పడే అవకాశం ఉంది.