బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు సాయి, దేవరాజ్ రెడ్డి కారణమని పోలీసులు ప్రాధమిక నిర్దారణకు వచ్చారు. వాళ్ల పై కేసు నమోదు చేశారు. కొద్దిసేపటిక్రితం వీరిద్దరినీ అరెస్టు చేశారు. ప్రస్తుతం కోవిడ్ పరీక్ష నిమిత్తం ఆసుపత్రి తరలించారు. ఈ కేసులో సాయిని ఏ 1, అశోక్ రెడ్డిని ఏ 2గా, దేవరాజ్ ని ఏ 3లుగా గుర్తించారు పోలీసులు.
నిర్మాత అశోక్ రెడ్డి కూడా ఈ కేసులో ప్రధానమైన నిందితుడు. శ్రావణితో వివాహేతర సంబంధం కోసం అశోక్ రెడ్డి ప్రయత్నించాడన్నది పోలీసుల నిర్థారణలో తేలింది. ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఎస్.ఆర్.నగర్ పోలీసులు ఆదేశించినా, అశోక్ రెడ్డి రాలేదు. పైగా ఉదయం నుంచి ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. పరారీలో ఉన్న అశో్క్ రెడ్డిని పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. శ్రావణిని ప్రేమించి పెళ్లికి నిరాకరించిన దేవరాజ్ రెడ్డి ఆమె ఆత్మహత్యకు పరోక్షంగా కారణమైతే, పెళ్లి చేసుకోమని వేధించి, శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి సాయి ప్రత్యక్షంగా ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సాయి, దేవరాజ్ ల స్టేట్మెంట్తో పాటు, కాల్ రికార్డ్, డేటాని పోలీసులు సాక్ష్యాధారాలుగా సబ్మిట్ చేయబోతున్నారు. రేపు నాంపల్లి కోర్టులో నిందితుల్ని హాజరు పరిచే అవకాశం ఉంది.