శ్రీలీల కెరీర్ ప్రారంభంలోనే జెట్ స్పీడ్ అందుకొంది. తొలి సినిమా `పెళ్లి సందడి`తోనే… టాప్ గేర్లోకి వెళ్లిపోయింది. ఎడా పెడా సినిమాలు చేసేసింది. అయితే ఆ తరవాత ఫ్లాపులు వరుస కట్టాయి. దాంతో శ్రీలీల కాస్త డౌన్ అయ్యింది. మళ్లీ `పుష్ప 2`లో ఐటెమ్ సాంగ్ తో రేసులోకి వచ్చింది. ఆ పాట బాగా క్లిక్ అయ్యింది. దాంతో పాటుగా కొత్త అవకాశాలు వచ్చి చేరాయి. తెలుగులో ఇప్పుడు శ్రీలీలని హీరోయిన్ గా ఒప్పించాలంటే కనీసం రూ.3 కోట్లు సమర్పించుకోవాల్సిందే. అంత ఇస్తానన్నా ప్రస్తుతానికి తన కాల్షీట్లు సిద్ధంగా లేవు. అంత బిజీ. ఇంత హడావుడిలోనూ హిందీలో ఓ సినిమా చేస్తోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందిస్తున్న సినిమాలో తనే కథానాయిక. ఇటీవలే టీజర్ విడుదలైంది. దీపావళికి సినిమాని తీసుకొస్తారు.
ఈ సినిమా కోసం శ్రీలీల అందుకొన్న పారితోషికం రూ.1.75 కోట్లని సమాచారం. అంటే దాదాపుగా తెలుగులో అందుకొంటున్న పారితోషికానికి సగం అన్నమాట. నిజానికి బాలీవుడ్ లో పారితోషికాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మన దగ్గర్నుంచి అక్కడకు వెళ్తే గీచి గీచి బేరాలు ఆడతారు. ఇటీవల రష్మిక బాలీవుడ్ లో `చావా`లో నటించింది. అక్కడ తనకు రూ.4 కోట్ల పారితోషికం అందిందని టాక్. సౌత్ లోనూ తను అంతే మొత్తాన్ని అందుకొంటోంది. బాలీవుడ్ లో కదా, కాస్త గట్టిగా ఇస్తారు అనుకొంటే… మన కథానాయికలకు అక్కడ పారితోషికాల్లో రిబేటు అడుగుతున్నారు. మనవాళ్లు కూడా హిందీ సినిమా మోజులో పడి ఎంతిస్తే అంతకు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకొంటున్న కథానాయికలకు మాత్రం తెలుగులో ఎక్కువ పారితోషికాలే గిట్టుబాటు అవుతున్నాయి. బాలీవుడ్ లో ఎంత అందుకొంటే, అంతకు రెట్టింపు ఇస్తున్నారు. మన హీరోయిన్లకు మాత్రం అక్కడ సగానికి సగం తగ్గించేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమో..?!