వరుస సినిమాలతో, రెండు మూడు షిఫ్ట్‌లలో పని చేసిన శ్రీలీల ఇప్పుడు లాంగ్ బ్రేక్ తీసుకోబోతోంది. ఒకదాని తరవాత ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి.. ఫ్లాపులు శ్రీలీలని డిస్ట్రబ్ చేశాయి. లేటెస్టుగా ‘గుంటూరు కారం’లో కూడా తన పాత్ర మరీ తీసికట్టుగా మారిపోయింది. మరోవైపు.. చేతిలో అవకాశాలు ఉన్నా, అవి మెల్లమెల్లగా జారుకోవడం మొదలెట్టాయి. కొన్ని సినిమాల్ని శ్రీలీల కావాలనే వదులుకొంది. ఇప్పుడు శ్రీలీల చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా ఇప్పట్లో మొదలుకాదు. పవన్ సెట్లోకి ఎప్పుడు అడుగు పెడతాడో చెప్పలేని పరిస్థితి. దాంతో శ్రీలీల కూడా ‘బ్రేక్’ మూడ్ లోకి వెళ్లిపోయింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు శ్రీలీల చదువుకొంటోంది. ఎంబీబీఎస్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అందుకే ఈ బ్రేక్‌లో చదువుపై దృష్టి పెట్టాలనుకొంటోంది శ్రీలీల. గతేడాదంతా ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా గడిపింది శ్రీలీల. అందుకే చదువుపై ఫోకస్ చేయలేకపోయింది. కెరీర్లో తను ఎదురు చూస్తున్న సక్సెస్ రాలేదు. సినిమాలైతే చేసింది కానీ, ఫలితాలు తనకు అనుకూలంగా లేవు. భగవంత్ కేసరి తప్ప.. ఏ ఒక్క సినిమా శ్రీలీలను సంతృప్తి పరచలేకపోయింది. అయితే అందులో శ్రీలీలది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. కమర్షియల్ హీరోయిన్ గా చేసిన పాత్రలు ఆమెకు మంచి పేరు తీసుకురాలేకపోయాయి. ఎక్కడ తప్పు జరుగుతుందో, ఏ విషయంలో తాను మెరుగుపడాలో తెలుసుకోవాలంటే శ్రీలీలకు ఈ బ్రేక్ తప్పదు.