పాపం శ్రీలీలకు దిష్టి తగిలిందేమో..? వరుసగా ఫ్లాపులు మూటగట్టుకొంటోంది. మొన్నటికి మొన్న ‘స్కంద’, నిన్న ‘ఆది కేశవ’… ఈరోజు ‘ఎక్ట్సా..’. సినిమా హిట్టూ, ఫ్లాపు అనేది పక్కన పెట్టండి. ఈ మూడు సినిమాల్లో శ్రీలీల పాత్రలు మరీ… తీసికట్టుగా తయారయ్యాయి. శ్రీలీల అంటే.. డాన్సులు చేస్తే సరిపోతుందిలే – అనే భావనలో దర్శకులు, రచయితలూ తయారయ్యారు. దాంతో… అసలు ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు శ్రీలీలకు దక్కుతున్నాయి.
శ్రీలీల కూడా ఏం చేస్తుంది? తన చేతిలో బోలెడు సినిమాలు. తక్కువ కాల్షీట్లు డిమాండ్ చేసే సినిమాలకు శ్రీలీల ఓటేస్తోంది. సినిమాలో తన ప్రాధాన్యం ఎంత తక్కువైతే, సినిమా అంత త్వరగా పూర్తయిపోతుంది. ఇదీ.. శ్రీలీల లెక్క. దాంతో తక్కువ టైమ్ లోనే ఎక్కువ సినిమాలు పూర్తి చేస్తోంది. దాని వల్ల.. తన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆలోచించడం లేదు. పైగా శ్రీలీల ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఓకేలా ఉన్నాయి. తన పాత్రలూ ఒకేలా తయారవుతున్నాయి. ‘ఆది కేశవ’లోని శ్రీలీల చేసిన పాత్రకూ… ‘ఎక్ట్సా’లోని పాత్రకూ ఏమాత్రం తేడా లేదు. పైగా రెండు సినిమాలూ బ్యాక్ టూ బ్యాక్ విడుదల అయ్యాయి. కనీసం శ్రీలీల ఇదైనా చూసుకోవాలి కదా? తక్కువ రోజుల్లో ఎక్కువ సినిమాలు చేసేయాలన్న ఆత్రాన్ని.. శ్రీలీల దగ్గించుకొంటే మంచిది. ఒక్క…’భగవంత్ కేసరి’ తప్పిస్తే… ఇప్పటి వరకూ శ్రీలీల చేసిన పాత్రలేవీ నటిగా ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. పైగా శ్రీలీల బోర్ కొట్టేస్తోంది. తనపై ట్రోల్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త యేడాదిలో ఒప్పుకోబోయే సినిమాలపై, ఎంచుకొనే కథలపై శ్రీలీల మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది