ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవడమే కష్టం. పోగొట్టుకోవడం చాలా ఈజీ. వచ్చింతన సేపు పట్టదు. వెళ్లిపోవడానికి. చాలామంది విషయంలో ఇది అక్షర సత్యమైంది. ఓ ఇమేజ్ సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. శ్రీలీల ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం వచ్చేసింది.
‘పెళ్లి సందడి’తో… ఒక్కసారిగా దుమారం రేపిన తెలుగమ్మాయి శ్రీలీల. ఆ తరవాత తన ఇమేజ్ ఎక్కడికి వెళ్లిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేతి నిండా సినిమాలే. కాల్షీట్లు ఖాళీ లేక, పెద్ద హీరోల సినిమాల్ని కూడా పక్కన పెట్టే పొజీషన్ కి వచ్చింది. పైగా అన్నీ హిట్లే. దాంతో శ్రీలీల క్రేజ్ సినిమా సినిమాకీ పెరిగింది.
ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకటి ‘స్కంద’ రూపంలో. మరో షాక్ ‘ఆది కేశవ’. స్కంద లో శ్రీలీల చేసిందేం లేదు. కొన్ని డాన్స్ మూమెంట్లు చేసింది. ఫైట్ సీక్వెన్స్‌లలో షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అంతే. ఆ సినిమా ఫ్లాప్ అయినా శ్రీలీలకు ఒరిగిందేం లేదు. కానీ. ఆది కేశవలో మాత్రం శ్రీలీల మరీ తేలిపోయింది. తన బలం డాన్స్. అలాగని చీటికీ మాటికీ స్టెప్పులు వేయించేస్తే ఎలా? అదే ఇంకాస్త గట్టి దెబ్బ కొట్టింది. రాను రాను శ్రీలీల డాన్సులు కూడా బోరైపోయే ప్రమాదం ఉంది. శ్రీలీల చేతి నిండా సినిమాలతో బిజీనే. కానీ అవి ఎలాంటి సినిమాలు, వాటిలో కథానాయిక పాత్రలకు ఉన్న స్టఫ్ ఏమిటి? తన కెరీర్‌కి ఏ రకంగా ఉపయోగపడతాయి? అనేది తెలుసుకోవాల్సిన అవసరం శ్రీలీల ముందుంది.
శ్రీలీల కెరీర్లో ఇది రెండో ఫ్లాప్ మాత్రమే. దీన్ని శ్రీలీల మొదటి వార్నింగ్ బెల్ గా తీసుకోవాలి. ఇలాంటి ఫ్లాపులే మరో రెండు పడితే శ్రీలీల కూడా బోర్ కొట్టి, ఏ కృతి శెట్టిలాలో మారిపోయే ప్రమాదం ఉంది. ఈ డిసెంబరులో శ్రీలీల నుంచి ఓ సినిమా (ఎక్స్ట్రా) వస్తోంది. జనవరిలో `గుంటూరు కారం` ఉంది. ఈ రెండింటిపై శ్రీలీల గట్టి నమ్మకంతో ఉంది. ఆ విజయాలు ఈ అచ్చ తెలుగు కథానాయికకు కాస్త ఉపశమనం కలిగించొచ్చు