వయసులోకి వచ్చిన ప్రతి మగాడికి మీసం వుంటుంది. మీసం వచ్చిన ప్రతి మగాడు పౌరుషానికి ప్రతీకగా దాన్ని తిపొచ్చు. అయితే… మీసాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తిప్పకూడదు, తిప్పాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే తిప్పాలంటున్నారు హీరో శ్రీవిష్ణు. ఆ సమయం ఎప్పుడు? మీసాన్ని ఎప్పుడు తిప్పాలి? అనేది ‘అసుర’ ఫేమ్ కృష్ణవిజయ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో చెబుతున్నామని తెలిపారు శ్రీవిష్ణు. ఇంతకీ, ఆ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? ‘తిప్పరా మీసం’! అదండీ సంగతి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘మెంటల్ మదిలో’ సినిమాలతో యువతరం ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ, మరోవైపు సోలో హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. ‘మెంటల్ మదిలో’ తర్వాత శ్రీవిష్ణు సోలో హీరోగా నటించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తిప్పరా మీసం’ స్టోరీ లైన్ గురించి చెప్పారు. ఇప్పటివరకూ తెలుగు తెరమీద ఇటువంటి సినిమా రాలేదని శ్రీవిష్ణు చెబుతున్నారు.