శ్రీవిష్ణుకి హిట్టు,ఫ్లాపులతో సంబంధం ఉండదు. ఎప్పుడైనా సరే, ఓ మంచి కథని ఎంచుకోవాలన్నదే తన తాపత్రయం. కథల ఎంపికలో తన ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటుంటాడు. అందుకే శ్రీవిష్ణు సినిమాలంటే ఓ నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు తను మరో కథతో వస్తున్నాడు. అదే `భళా తందనాన`. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన చిత్రమిది. బాణంతో ఆకట్టుకున్న దర్శకుడు చైతన్య దంతులూరి. ఆ తరవాత.. బసంతి తీశాడు. రెండింటిలోనూ సోషల్ మెసేజ్ ఉంది. ఇప్పుడు `భళా తంతనాన` చూసినా.. మరో బలమైన సామాజిక ఇతివృత్తాన్ని తీసుకున్నాడనిపిస్తోంది.
”రాక్షసుడ్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి..
నేను మామూలు మనిషిని…” అనే శ్రీవిష్ణు డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది.
”నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మాన్‌కి కూడా రిస్కే, లంచం లేనిదే – కంచంలో అన్నం కూడా దొరకడం లేదు..” అనే డైలాగులు చూస్తుంటే…
అవినీతిపై ఓ సామాన్యుడు చేస్తున్న యుద్ధంలా.. ఈ కథ సాగినట్టు అనిపించింది. ఈ పాత్ర కోసం విష్ణు కూడా చాలా అవతారాలు ఎత్తాడు. కథలో ట్విస్టులు, టర్న్‌లూ బలంగా ఉన్నాయనిపిస్తోంది.
”సీఎం కుర్చీలో కుర్చున్న ఎవరైనా, ఒక్క సంతకంతో మొత్తం స్టేజ్ ఫ్యూచర్‌నే మార్చేయొచ్చు. అంటే ఆ పవర్.. చేతిదా, లేదంటే కుర్చీదా?” అనే డైలాగ్ తో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడు. మణిశర్మ నేపథ్య సంగీతం మరింత బలాన్నిచ్చింది. విజువల్స్ బాగున్నాయి. మొత్తానికి… మరో కొత్త తరహా కాన్సెప్ట్ చూస్తామన్న నమ్మకం కలిగించింది ఈ టీజర్. సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.