కొత్త తరహా కథలకు కేరాఫ్ అడ్రస్స్ శ్రీవిష్ణు.
సినిమా హిట్టో.. ఫ్లాపో పట్టించుకోడు. తన పని తాను నిజాయతీగా చేసుకుంటూ వెళ్తాడు. ఆ ప్రయాణంలో నటుడిగా మెరుగువుతూ.. మధ్యమధ్యలో మర్చిపోలేని విజయాలు అందుకుంటూ సాగిపోతున్నాడు. నీది నాది ఒకటే కథ. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా.. ఇలాంటి సూపర్ హిట్స్.. తన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు రాజ రాజ చోరగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్లు, పోస్టర్లూ.. ఆకట్టుకుంటున్నాయి. గురువారం రాజ రాజ చోర ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో శ్రీవిష్ణుతో చిట్ చాట్.
ఈ సినిమాని వెంకటేష్ చిత్రాలతో పోల్చారు. కారణమేంటి?
– ఈ సినిమా చూస్తున్నంతసేపూ.. నాకు ఆ ఫీల్ అయితే కలిగింది. కుటుంబం అంతా కలిసి చూడదగిన సినిమా. ఇది హ్యూమర్ ఉన్న సినిమా ఇది. చాలామంచి ఎమోషన్ ఉంది. దాని వల్ల అనిపించి ఉండొచ్చు.
స్వతహాగా మీరు వెంకటేష్ అభిమాని కదా.. అది కూడా కారణమై ఉండొచ్చా?
– అవునండీ. నేను వెంకటేష్ గారికి వీరాభిమానిని. నిజానికి ఆయనకు ఈ సినిమాకి సంబంధించిన సలహాలూ సూచనలూ ఆయన దగ్గర చాలా తీసుకున్నా. ఈ సినిమా చేసే ముందు.. ఆయన్ని కలుసుకున్నా. ఈ కథేంటో ఆయనకు చెప్పా. ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే.. ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది. `కామెడీ టైమింగ్ బాగుంది. భలే చేశావ్..` అన్నారు. నిన్నే ఆయన్ని మళ్లీ కలిశా. నేను వెంకటేష్ గారికి వీరాభిమాని. ఆయన్ని ఇది వరకు కలుసుకునే అవకాశాలు చాలా వచ్చాయి.
`నా అంతట నేను వెళ్లకూడదు. నా వర్క్ నచ్చి ఆయన పిలవాలి` అని టార్గెట్ గా పెట్టుకున్నా. `నీదీ నాదీ` విడుదలయ్యాక.. ఆయన పిలిపించారు. నటుడిగా ఆయన్ని కలుసుకోవడం అదే తొలిసారి. ఆ సినిమా గురించి బాగా చెప్పారు. `ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరకు రా. నీకేం కావాలన్నా అడుగు` అన్నారు. అప్పటి నుంచీ.. నా ప్రతీ సినిమా గురించీ ఆయనతో డిస్కర్స్ చేస్తా. సలహాలు తీసుకుంటా.
ఇప్పుడు లేటెస్టుగా ఆయన ఇచ్చిన సలహా ఏమిటి?
– అన్నింట్లోనూ బాగా చేస్తున్నావ్. మాస్ పై కూడా దృష్టి పెట్టు. దానిపై వర్కవుట్ చేయి.. మాస్ వాళ్లకీ డిఫరెంట్ సినిమాలు అలవాటు చేయ్.. అన్నారు.లక్కీగా నా తరువాతి సినిమాలు మాస్ కోసమే. మాస్కి అవి చాలా కొత్తగా అనిపిస్తాయి. ఓ టైమ్ లో `మీడియా చూసి వాళ్లకు నచ్చితే చాలు` అనుకునేవాడ్ని. మెల్లమెల్లగా ఓ వర్గానికి చేరువయ్యాను. ఇక మీదట అందరికీ నచ్చేలా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను.
మీ సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం చాలా ఎక్కువే మాట్లాడారు. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది?
– కథ వల్లే అంత కాన్ఫిడెన్స్. కథ నిజంగా బాగా కుదిరింది. ఆ కథ గురించి ఎక్కువగా చెప్పకూడదు. నా సినిమాలో ఏమేం ఉంటాయో.. క్లియర్ చేసేసి, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం నా అలవాటు. అయితే.. ఈ సినిమా విషయంలో కాస్త నిజాయతీగాగా ఉండాలనుకున్నా. నా సినిమాలో సిద్ శ్రీరామ్ పాట పాడారు. ఆ పాటని అసలు ఎక్కడా రివీల్ చేయలేదు. థియేటర్లో చూస్తేనే ఓ కిక్ వస్తుందని.. ఆ పాట అలా దాచేశాం. బయట పరిస్థితులు ఏం బాగాలేవు. థియేటర్లకు రావాలన్నా భయపడుతున్నారు. నేను కాన్ఫిడెన్స్ గా మాట్లాడితేనే జనాలు థియేటర్లకు వస్తారు. నేనేం మాట్లాడినా.. మనసుతోనే మాట్లాడాను.
మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
– ఓ దొంగ. పెద్ద పెద్ద స్కాములు చేసే దొంగ కాదు. కొంటె దొంగ. చిల్లర దొంగ. ఈ సినిమాలో నేను మాట్లాడే ప్రతీ మాటా అబద్ధమే. కానీ.. జనాలు అది నిజమే అనుకుంటారు. ఆ టైపు పాత్ర నాది. ఓ పది నిమిషాల్లో మొత్తం క్యారెక్టర్లన్నీ పరిచయం అయిపోతాయి. ఆ తరవాత.. కథ గమ్మత్తుగా సాగుతుంది. తెలియకుండానే ఆయా పాత్రల్ని ఇష్టపడతాం.
పాన్ ఇండియా స్టఫ్ ఉంది అన్నారు… మీరు చెప్పినట్టు ఈ సినిమాని అన్ని భాషల్లోనూ రీమేక్ చేస్తారంటారా?
– నా సినిమాల్నీ హిందీలో, మలయాళంలో, తమిళంలో చేస్తున్నారు. కానీ నేనెప్పుడూ చెప్పుకోలేదు. ఓ మంచి కథ ఉంటే తప్పకుండా రీమేక్ అవుతుంది. ఆ నమ్మకంతోనే అలా మాట్లాడా. ఈ సినిమా ఏ భాషలో చేసినా కచ్చితంగా బాగుంటుంది.
మీ పాత్రల్లో ఎక్కువగా కామెడీ టచ్ ఉంటుంది. ఈసారీ అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
– కామెడీ చేయడం చాలా కష్టం. కామెడీ సెన్స్ మనకు ఉన్నా.. ఒక్క పరిధికే పరిమితం అయిపోతాం. అందుకే కామెడీలోనే చిన్న చిన్న వేరియేషన్స్ ట్రై చేస్తూ వచ్చా. రాజ రాజ చోర..లో మరో టైపు కామెడీ చేశా. నిజానికి దర్శకుడు నాకు ఇది వరకు ఓ కథ చెప్పాడు. అది వేరే జోనర్ సినిమా. అది ఆడియన్స్కి ఎక్కుతుందా, లేదా? అనే గందరగోళంలో ఉన్నా. కానీ చాలామంచి కథ. కాకపోతే కాస్త రిస్క్. అందుకే కొన్ని రోజులు పక్కన పెట్టి, ఈ కథ ఎంచుకున్నాం. ఆ కథ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా చేస్తాం.
కొత్త దర్శకులతో చేస్తున్నప్పుడు ఈజీగా అనిపిస్తుందా?
– ఈజీ అని కాదు. వాళ్లతో చేసినప్పుడు కొంచెం భయం ఉంటుంది. బాధ్యత ఉంటుంది. సీనియర్ దర్శకుడంటే రిలాక్స్ అయిపోతాం. `అన్నీ ఆయన చూసుకుంటాడులే` అని వదిలేస్తాం. కానీ కొత్త దర్శకులతో.. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సపోర్టింగ్ గా ఉండాలి. మన బుర్ర కూడా.. యాడ్ అవుతుంది. ప్రేక్షకులకు అంచనాలేం ఉండవు కాబట్టి.. త్వరగా వాళ్లని రీచ్ అవ్వొచ్చు.
ఓ పెద్ద హిట్.. తరవాత మళ్లీ సడన్ గా డౌన్ అయిపోతుంటారు. మీ కెరీర్ ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది?
– అది మన చేతుల్లో లేని విషయం. మంచి కథలు ఎంచుకోవడం మన బాధ్యత. కొన్నిసార్లు మిస్ అవుతాయి. ఎందుకు తప్పు చేశామో,.. చూసుకోవాలి. ఆ తప్పులు రిపీట్ కాకూడదు.
గాలి సంపత్ నిరాశ పరిచిందా? ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణమేంటి?
– గాలిసంపత్ చాలా నిరాశ పరిచింది. ఆ సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలున్నాయి. సినిమా అంటే అందరికీ నచ్చాలనే తీస్తాం. కొన్నిసార్లు జరుగుతాయి. కొన్నిసార్లు జరగవు. అదో ప్రాసెస్. రిలీజ్ డేట్ విషయంలో తొందరపడ్డాం. డేట్ అనుకుని.. అప్పుడు సినిమా పూర్తి చేశాం. దాంతో కొన్ని తప్పులు జరిగిపోయాయి.
ఇప్పుడు చేస్తున్న సినిమాలేంటి?
– అర్జున ఫాల్గున.. భళా దంతనాన తో పాటు ఓ బయోపిక్ చేస్తున్నా. ఓ పోలీస్ అధికారి బయోపిక్ అది. చాలా అద్భుతమైన కథ. ఆ తరవాత అలాంటి కథలు దొరుకుతాయో లేదో చూడాలి.