విభిన్నమైన కథల్ని ఎంచుకోవడం శ్రీవిష్ణు స్టైల్. తన సినిమాల జాబితా చూస్తే, ఒకదానితో మరోటి పొంతన ఉండదు. జోనర్లు మారుస్తుంటాడు. ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ భుష్’తో నవ్వించిన శ్రీవిష్ణు ఇప్పుడు ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ని ఎంచుకొన్నాడు. ‘మీకు మీరే మాకు మేమే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు హుస్సేస్ షా. కొన్ని సూపర్ హిట్ చిత్రాలకు రచయితగానూ పని చేశాడు. ఇప్పుడు శ్రీవిష్ణుతో క్రైమ్ జోనర్లో ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రూపొందిస్తున్నాడు. దాదాపుగా 60 శాతం షూటింగ్ పూర్తయింది.
రెబాజాన్ ఈ చిత్రంలో కథానాయిక. ‘సామజ వరగమన’ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా నటించింది ఈ అమ్మాయే. వీరిద్దరికీ ఇది రెండో సినిమా అవుతుంది. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మాతలు. త్వరలోనే టైటిల్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ యేడాదే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.