పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు ఓ అలవాటు ఉంది. తమ సంస్థలో ఏ హీరో సినిమా చేయడానికి వచ్చినా, వాళ్లతో రెండు మూడు సినిమాలకు ఎగ్రిమెంట్ చేయించుకొంటారు. అలా ఆ హీరోతో వరుసగా సినిమాలు చేస్తుంటారు. హిట్లూ, ఫ్లాపులతో సంబంధం లేదు. ఆ హీరోతో రిలేషన్ షిప్ ముఖ్యం అనే పద్ధతి పీపుల్ మీడియా ఫ్యాక్టరీది. శ్రీవిష్ణుతో రెండు సినిమాలు చేసింది పీపుల్ మీడియా. అందులో ‘శ్వాగ్’ ఈమధ్యే విడుదలైంది. ఈ సినిమాకు రివ్యూలు చాలా బ్యాడ్ గా వచ్చాయి. వసూళ్లూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయినా సరే, శ్రీవిష్ణుతో మరో సినిమా ప్లాన్ చేసేశారు నిర్మాత విశ్వ ప్రసాద్. ఈసారి కథంతా అమెరికాలో జరుగుతుందట. హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నామని విశ్వ ప్రసాద్ తెలిపారు.
అంతే కాదు.. ‘శ్వాగ్’ దర్శకుడు అశిత్ గోలీకి మరో ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాకు సంబంధించిన విషయాలూ త్వరలోనే వెల్లడిస్తామన్నారు విశ్వప్రసాద్. నిజానికి ‘శ్వాగ్’ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ శ్రీవిష్ణునే. విశ్వ ప్రసాద్ కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టారు. కథ, కథనాలు, పాత్రధారుల ఎంపిక… ఇవన్నీ శ్రీవిష్ణునే చూసుకొన్నాడు. ఫలితం అటూ ఇటుగా వచ్చినా, శ్రీవిష్ణు కమిట్ మెంట్ విశ్వ ప్రసాద్ కు నచ్చి ఉండొచ్చు. పైగా సినిమాని అనుకొన్న బడ్జెట్ లో పూర్తి చేశాడు విష్ణు. అందుకే విష్ణుతో మరో సినిమా ప్రపోజల్ ని ముందుకు తీసుకెళ్లారేమో అనిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత త్వరగా 100 సినిమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకొచ్చింది. ఆ క్రమంలో ఫ్లాపులొచ్చినా, ఈ సంస్థ పట్టించుకోకుండా సినిమాలు చేస్తుండడం విశేషం.