శ్రీవిష్ణు చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా అల్లూరి. ఈ సినిమాపై శ్రీవిష్ణు చాలా నమ్మకాలు పెట్టుకొన్నాడు. భారీ ఎత్తున ప్రమోషన్ చేశాడు. తన కెరీర్ని కొత్త దారిలోకి తీసుకెళ్తుందని భావించాడు. కానీ.. ఫలితం రివర్స్ అయ్యింది. ఈసినిమా కోసం శ్రీవిష్ణు కష్టపడిన విధానం ఒక ఎత్తయితే, ఈ సినిమా విడుదల కోసం శ్రీవిష్ణు పడిన శ్రమ మరో ఎత్తు. శుక్రవారం ఈ సినిమా విడుదల అనగా.. గురువారం నిర్మాత బెక్కం వేణుగోపాల్ చేతులు ఎత్తేశారు. ఆయన గత సినిమాల అప్పులు.. వెంటాడాయి. దాంతో శ్రీవిష్ణు రంగంలోకి దిగాల్సివచ్చింది. అప్పటికప్పుడు రూ.2 కోట్ల మేర వెనక్కి ఇచ్చి, ఎన్.ఓ.సీ తెచ్చుకొని, సినిమాని రిలీజ్ చేశాడు. ఈ సినిమా నిర్మాణానికీ, శ్రీవిష్ణుకీ ఎలాంటి సంబంధం లేదు. అసలు బెక్కం వేణుగోపాల్ అనే నిర్మాతకు గతంలో అప్పులు ఉన్నాయన్న సంగతి కూడా తెలీదు. మరో హీరో అయితే.. `సినిమా రిలీజ్ అయితే నాకేంటి, అవ్వకపోతే నాకేంటి` అని వదిలేసేవాడు. కానీ శ్రీవిష్ణు మాత్రం అలా చేయలేదు. తన పూచీకత్తుతో సినిమాని విడుదల చేయించాడు. ఇంతా చేసినా `అల్లూరి`కి సరైన రిజల్ట్ రాలేదు. సినిమా కోసం తెరపై, రిలీజ్ అవ్వడానికి బయటా తను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కలేదు. బ్యాడ్ టైమ్ అంటే ఇలానే ఉంటుందేమో..?!