`బాణం`తో ఆకట్టుకున్న దర్శకుడు చైతన్య దంతులూరి. ఆ సినిమాతో నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత.. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ తో `బసంతి` తీశాడు. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆకట్టుకోకపోయినా.. అందులోనూ చైతన్య మార్క్ కనిపించింది. అప్పటి నుంచి… ఇప్పటి వరకూ చైతన్య మెగాఫోన్ పట్టలేదు. కథలు తయారు చేసుకుని, రకరకాల ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు శ్రీవిష్ణుకి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. `బ్రోచేవారెవరురా` లాంటి సూపర్ హిట్ తో… మంచి ఫామ్ లో ఉన్నాడు శ్రీవిష్ణు. తన సినిమాలు కొన్ని బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టినా – మంచి ప్రయత్నాలు, ఆలోచనలుగా మిగిలిపోయాయి. కాబట్టి.. ఈ కాంబోపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. త్వరలోనే.. నిర్మాణ సంస్థ, ఇతర వివరాలతో ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. 2021 ప్రధమార్థంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం వుంది.