రేటింగ్:. 2.75
వ్యవసాయం జూదంలా మారిందనేది ఎవరైనా ఒప్పుకునే నిజం. కరెంటుంటే ఎరువులు ఉండవు. ఎరువులు ఉంటే… పండించిన పంటకి మార్కెట్ ఉండదు. మార్కెట్ ఉన్న పంటని మనం పండించే పరిస్థితులు ఉండవు. కానీ తరాలుగా వ్యవసాయం తప్ప మరొకటి తెలియదు కాబట్టి అప్పులు చేసి మరీ పొలాల్లో చెమటోడుస్తుంటారు రైతులు. చివరికి ఆ అప్పులు తప్ప మరేమీ మిగలని పరిస్థితులు. ఎంతోమంది రైతులు ఊళ్లని వదిలిపెట్టి పట్టణాల్లో రకరకాల పనులు చేస్తూ కనిపిస్తుంటారు. ఇలాంటి అంశాల్ని స్పృశిస్తూ సినిమా తీయడం అంటే సాహసమే. అందుకే వ్యవసాయం నేపథ్యంలో సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కానీ ఇటీవల దర్శకులు ఈ తరహా కథలకీ వాణిజ్య హంగులు జోడిస్తూ సినిమాలు తీస్తున్నారు. విజయాల్ని అందుకుంటున్నారు. శ్రీకారం అలాంటి కథే.
కార్తీక్ (శర్వానంద్) సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా సంపాదిస్తాడు. తన తండ్రి కేశవులు (రావు రమేష్) కుటుంబం కోసం చేసిన అప్పుల్ని కూడా తీర్చేస్తాడు. కొడుకు తనలా వ్యవసాయం చేయకుండా సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నందుకు సంతోషిస్తాడు. అమెరికా వెళతాడంటూ గొప్పలు చెప్పుకుంటుంటాడు. కానీ కార్తీకేమో తనతండ్రికి షాక్ ఇస్తూ వ్యవసాయం చేస్తానంటూ ఉద్యోగాన్ని వదిలి ఊరికొచ్చేస్తాడు. ప్రేమించిన అమ్మాయి ఛైత్ర (ప్రియాంక అరుళ్ మోహన్), ఆమె తండ్రి వారించినా వినిపించుకోడు. ఊరంతా కలిసి వ్యవసాయం చేద్దామని పిలుపునిస్తాడు. మరి అది సాధ్యమైందా? ఎన్నో సవాళ్లున్న వ్యవసాయంలో కార్తీక్ రాణించాడా లేదా అనేదే కథ.
మహేష్‌బాబు `మహర్షి` సినిమా వీకెండ్ ఫార్మింగ్ అనే నినాదాన్ని తీసుకొచ్చింది. ఆఫీసులు, పాఠశాలల నుంచి బయటికొచ్చి పార పలుగు చేతపట్టాలంటూ అందరికీ పిలుపినిచ్చింది. ఈ సినిమా కూడా అదే తరహాలో… ఉమ్మడి వ్యవసాయం, లైవ్ ఫార్మింగ్ అంటూ కొత్త దారుల్ని చూపిస్తుంది. రాబోయే ట్రెండ్ వ్యవసాయమే అంటూ యువతరానికి సందేశాన్నిస్తుంది. ఇలాంటి విషయాల్ని సినిమా ద్వారా చెప్పడం సాహసమే. ప్రేక్షకులు కోరుకునే వాణిజ్యాంశాల్ని ఈ కథల్లో మేళవించడం కష్టమైన ప్రక్రియే. కానీ నవతరం దర్శకులు ట్రెండ్‌కి తగ్గ పాత్రలు, కథల్లో ఇలాంటి సామాజికాంశాల్ని మేళవిస్తూ తాము చెప్పదలచుకున్నది విజయవంతంగా చెబుతుంటారు. అలా `శ్రీకారం` చిత్రాన్ని కూడా భావోద్వేగాల ప్రయాణంలా… ఈ కథ, పాత్రల్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు దర్శకుడు. పుట్టి పెరిగిన ఊళ్లల్లో ఏం చేయాలో తెలియక… పట్నంలో ఉండలేక నేటి యువతరం గడుపుతున్న జీవితాల్ని గుర్తు చేస్తూ కథలో ప్రేక్షకుల్ని లీనం చేస్తాడు దర్శకుడు. గ్రామీణ జీవితాలు, అక్కడి పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సన్నివేశాలకి ఎవరైనా కనెక్ట్ కావల్సిందే.
హీరో ఊరికొచ్చినప్పట్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఉమ్మడి వ్యవసాయం అంటూ రంగంలోకి దిగుతాడు. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ.. అందులో సాధక బాధకాలు చాలానే ఉంటాయి. వాటిని పైపైనే స్పృశించిన దర్శకుడు ఆ తర్వాత వ్యవసాయాన్ని అందంగా చూపించడం మరీ ఫిల్మీగా అనిపిస్తుంది. అప్పటిదాకా ఓ ఉద్యోగం చేసి తండ్రి అప్పులు కట్టేసిన ఓ యువకుడు ఊళ్లోకి వచ్చీ రాగానే ఆధునికత సాంకేతికతని ఉపయోగిస్తూ కొత్త కొత్త పంటలు పడించడం మొదలుపెడతాడు. ఆ వెంటనే లాభాలు పంచి పెడతాడు. నిజానికి అక్కడితోనే ఈ కథ పూర్తయిపోతుంది. ద్వితీయార్థంలో హీరో, అతని తండ్రీ మధ్య సంఘర్షణని జోడించడం, విలన్ ఏకాంబరం (సాయికుమార్) ఊరి జనాల ఐక్యతని దెబ్బతీయడం, కరోనాతో వ్యవసాయానికి కొత్త సవాళ్లు ఎదురు కావడం, వాటిని తట్టుకుని పంటని అమ్మడం వంటి సన్నివేశాలుంటాయి. పతాక సన్నివేశాలు ప్రసంగంతో తీర్చిదిద్దారు. అయితే అందులో హీరో చెప్పే విషయాలు ఆసక్తిని, ఆలోచన రేకెత్తించేలా ఉండటం సినిమాకి కలిసొచ్చింది.
నటీనటుల్లో శర్వానంద్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. భావోద్వేగాల్ని పండించడంలో తాను బెస్ట్ అని మరోసారి నిరూపించాడు శర్వానంద్. పాత్రలో సహజంగా ఒదిగిపోయాడు. హీరోయిన్ ప్రియాంకతో లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రియాంక అరుళ్ మోహన్ అందంగా కనిపిస్తూ పక్కింటి అమ్మాయిని గుర్తు చేస్తుంది. రావు రమేష్ తండ్రి పాత్రలో చక్కటి భావోద్వేగాలు పండించారు. నరేష్ పల్లెటూరి రైతుగా మంచి పాత్రలో కనిపిస్తారు. సాయికుమార్ ఏకాంబరం పాత్రలో చేసిన సందడి ఆకట్టుకుంటుంది. సత్య పండించిన హాస్యం చిత్రానికి ప్రధాన బలం.
సాంకేతిక విభాగంలో సాయిమాధవ్ బుర్రా సంభాషణలకి ఎక్కువ మార్కులు పడతాయి. యువరాజ్ కెమెరా పనితనం పల్లెటూరి అందాల్ని మరింత అందంగా చూపించింది. మిక్కీ నేపథ్య సంగీతంతోపాటు పాటలు బాగున్నాయి. నిర్మాతలు ఈ కథని ఎంత నమ్మారో నిర్మాణ విలువలు చెబుతాయి.
దర్శకుడు కిషోర్‌కి ఇది తొలి చిత్రమే అయినా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెప్పాడు. భావోద్వేగాలపై మంచి పట్టుని ప్రదర్శించాడు. అక్కడక్కడా డ్రమటిక్‌గా అనిపించే సన్నివేశాలున్నా… భావోద్వేగాలతో కట్టిపడేస్తూ, మరోసారి మన మూలాల్ని గుర్తు చేసే ఓ మంచి ప్రయత్నమిది.
రేటింగ్:. 2.75