శ్రీలీల క్రేజీ హీరోయిన్, మంచి డాన్సర్. కానీ ఇప్పుడు మంచి మాటకారి కూడా అనిపించుకొంది. త్రివిక్రమ్ తో సినిమా చేసింది కదా? ఆ లక్షణాలు అబ్బకుండా ఎలా ఉంటాయి? ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుకలో… శ్రీలీల తన మాటలతో అదరగొట్టింది. మహేష్, త్రివిక్రమ్ లను ఎడా పెడా పొగిడేసింది. ‘బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే.. అదే మహేష్ బాబు’ అంటూ మహేష్‌ని ఒక్క మాటలో వర్ణించింది. మహేష్‌ని సెట్లో చూసి మెస్మరైజ్ అయిపోయానని, సెట్లో డైలాగులు కూడా మర్చిపోయానని, ఈ అనుభవం ఎప్పటికీ మర్చిపోనని చెప్పుకొచ్చింది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘పెళ్లిసందడి’తో తనని లాంచ్ చేస్తే త్రివిక్రమ్ రీ లాంచ్ చేశారని కొనియాడింది. ఎన్నో పుస్తకాలు చదివిన అనుభవం మాటల్లో పాటల్లో త్రివిక్రమ్ దారబోశారని, ఆయనతో పని చేయడం వల్ల ఎన్నో విషయాల్ని నేర్చుకొన్నానని చెప్పుకొచ్చింది శ్రీలీల. ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా కనిపించిన శ్రీలీల.. స్టేజీపై పాట పాడి, డాన్స్ చేసి ఫ్యాన్స్‌ని అలరించింది.
శ్రీలీల కెరీర్లో ఈ సినిమా చాలా కీలకం. 2023లో ఆమెకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. చేతి నిండా సినిమా అవకాశాలు ఉన్న మాట వాస్తవమే కానీ, వాటిలో ఫ్లాపుల సంఖ్య ఎక్కువ. వరుసగా మూడు డిజాసర్లని మూటగట్టుకోవాల్సివచ్చింది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి గుర్తింపు వస్తుంటుంది. కథలో ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయితే.. శ్రీలీల రీ లాంచ్ అయిపోయినట్టే.