శ్రీనువైట్ల సినిమాలు మంచి ఎంటర్టైనర్లు. ఫ్లాప్ సినిమాలు చూసినా.. కామెడీతో కాలక్షేపం చేయించేస్తాడు. విలన్ ఇంట్లో హీరో తిష్ట వేసుకుని.. బకరా చేసే ఫార్ములాని కనిపెట్టి, దాన్ని సక్సెస్ ఫుల్ సూత్రంగా మలిచింది కూడా శ్రీనువైట్లే. తన ఖాతాలో ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్లున్నాయి. కొన్నేళ్లుగా ఓ హిట్టు కోసం పరితపించిపోతున్నాడు శ్రీనువైట్ల. ఈసారి తనకు అచ్చొచ్చిన రవితేజని నమ్ముకుని ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తెరకెక్కించాడు. ఈ సందర్భంగా శ్రీనువైట్లతో చేసిన చిట్ చాట్ ఇది.
హిట్టు కొట్టాలన్న ఒత్తిడితో ఈ సినిమా తెరకెక్కించారా?
అదేం లేదండీ. చాలా కూల్‌గా చేసుకుంటూ వెళ్లా. ఈ సినిమాపై, ముఖ్యంగా ఈ కథపై చాలా నమ్మకం. అందుకే ఎక్కువ రిలాక్స్‌గా తీశా.
ఈమధ్య వరుసగా ఫ్లాపులు తగిలాయి. హిట్టు కొట్టాలన్న ఒత్తిడి మీపై ఉండడం సహజమే కదా?
నిజం చెప్పాలంటే మనం తప్పుల నుంచి ఎక్కువ నేర్చుకుంటాం. అలా నేర్చుకోవడం అవసరం కూడా. నా తప్పుల నుంచి నేను రియలైజ్ అయ్యాననే అనుకుంటున్నా. పీక్‌లో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో, అంతకు మించి పనిచేయాలని డిసైడ్ అయ్యా. అందుకే కొంత సమయం తీసుకున్నా. ఓ మంచి కథ తయారు చేసుకున్న తరవాత.. రవితేజని కలిశాను. ఒక్క సిట్టింగ్‌లోనే ఓకే చేసేశాడు. నేనూ రవి సినిమా చేద్దామనుకుంటున్నప్పుడు నలుగురైదుగురు అప్రోచ్ అయినా… మైత్రీతోనే పనిచేయాలనుకున్నా. వాళ్లు ఉండడం వల్లే. ఈ ప్రయాణం ఎంజాయ్ చేశా. మొత్తం సినిమా న్యూయార్క్‌లో జరుగుతుంది. కథ ప్రకారం షూటింగ్ అక్కడే జరగాలి. దాంతో పాటు రెండు షెడ్యూళ్లు చేయాలి. అది చాలా పెద్ద టాస్క్. మైత్రీ వల్లే.. ఈ ప్రయాణం ఇంత హ్యాపీగా జరిగింది. ప్రయాణం బాగుంటే.. ఫలితం బాగుంటుందని నా నమ్మకం.
లగ్జరీగా చేశానన్నారు… బడ్జెట్ దాటలేదా?
నిజంగానే నేను చాలా లగ్జరీగా చేసిన సినిమా ఇది. విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో బడ్జెట్ దాటి ఖర్చు పెట్టింది లేదు. అలా చేయను కూడా. ఈ సినిమా కూడా బడ్జెట్లో ఉంది. ప్రీడమ్ ఇచ్చారు కదా.. అని ఖర్చు పెంచేసేరకం కాదు నేను.
ఇంతకీ ఇది ఎలాంటి కథ…?
నేను రవితేజ ఇది వరకు చేసిన సినిమాలన్నీ ఓ జోనర్లో ఉంటాయి. ఇది కంప్లీట్ గా కొత్త కథ. గత సినిమాల్లో లేని బలమైన కథ ఇందులో బోనస్ గా ఉంటుంది. నేనూ రవితేజ అనగానే అల్లరి ఉంటుంది. దానికి మించి ఇందులో కథ ఉంటుంది.
ట్రైలర్ చూస్తే రివైంజ్ డ్రామా అనిపిస్తోంది..?
రివైంజ్ ఉంటుంది కానీ.. అదే కథ కాదు. హీరో, హీరోయిన్ల మధ్య ఓ కథ ఉంది. ఓ కొత్త పాయింట్ ఉంది. అదే ఈ కథకు కీలకం.
కొత్త రైటర్లతో కలిసి పనిచేశారు. ఆ అనుభవం ఎలా ఉంది?
నాకు స్టోరీ సిట్టింగ్ అంటే ఉదయం ఆరింటికి మొదలైపోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాతో పాటు నా రైటింగ్ బ్యాచ్ కూడా ఆరింటికి వచ్చేసేవారు. పడుకునేవరకూ నాతోనే ఉండేవారు. ఓసారి మేమంతా గోవా వెళ్లాం. అక్కడ సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు కూడా కథ గురించే మాట్లాడుకుంటూ.. ఉండేవాళ్లం. అలా స్టోరీ మేకింగ్ ఎంజాయ్ చేశాం.
ఈ కథ రవితేజని దృష్టిలో ఉంచుకునే రాశారా?
అవును. రవితేజని దృష్టిలో ఉంచుకునే చేశాం. టైటిల్ కూడా బాగా సెట్టయ్యింది. `అమర్ అక్బర్ ఆంటోనీ` తప్ప ఈ కథకు మరో ఆప్షన్ లేదు. ఓరోజు రాత్రి పదకొండు గంటలకు రవితేజకు ఫోన్ చేసి టైటిల్ చెప్పా. `అరె.. భలే వుంది అబ్బాయ్ టైటిల్` అన్నాడు. తను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ కదా. అందుకే.. వెంటనే ఒప్పుకున్నాడు.
తెలుగులో కనిపించకుండా పోయిన ఇలియానాని కథానాయికగా తీసుకోవాలన్న ఆలోచన మీదేనా?
నాదే. ఈ కథ రాసుకుంటున్నప్పుడు నా మైండ్లోకి వచ్చిన స్టార్ ఇలియానా. అయితే తను తెలుగులో సినిమాలు చేయడం లేదన్నారు. మధ్యలో వేరే కథానాయికల్ని అనుకున్నాం. కానీ నేనే ఉండబట్టలేక మళ్లీ ఇలియానాకు ఫోన్ చేసి అడిగా. లక్కీగా ఒప్పుకుంది.
బాద్ షా వరకూ మీరు తెలుగులోని అగ్ర దర్శకుల్లో ఒకరు. మధ్యలో వెనుకబడ్డానని అనిపించలేదా?
నా సినీ ప్రయాణం 38 లక్షలతో మొదలైంది. నీకోసం అనే సినిమా చేశా. చిన్న సినిమాలు చేసుకుంటూనే వచ్చా. నాకెప్పుడూ చిన్నా, పెద్ద తేడా లేదు. ఆ ప్రయాణంలో పెద్ద సినిమాలు చేశా. అవి హిట్టయ్యాయి. చిన్న సినిమాలతో మొదలై.. పెద్ద దర్శకుడ్ని అయ్యా. ఓ సినిమా బాగా ఆడింది.. సరిపోదు కదా. మరో సినిమా కూడా హిట్టుకొట్టాలి. హిట్లని కూడా సీరియెస్ గా తీసుకోను. కీర్తి కాంక్ష నాకు లేదు. నా గురించి అందరూ గొప్పగా మాట్లాడాలి అని నాకెప్పుడూ లేదు. నాకిష్టమైన వ్యక్తులతో పనిచేయాలనుకుంటాను. నాకు అదే కిక్. రేసులో ముందున్నానా, వెనుకున్నానా అని ఎప్పుడూ ఆలోచించుకోలేదు.
ఇప్పుడు మళ్లీ నీ కోసం లాంటి సినిమాల చేస్తారా?
అమర్ అక్బర్ ఆంటోనీ కొత్త సినిమా. ఓ రకంగా కొత్త జోనర్. ఇలాంటి జోనర్లో ఇంత వరకూ సినిమా రాలేదు. ప్రస్తుతం నా సెటప్ అంతా మార్చుకున్నా. కొత్త రచయిలతో ప్రయాణం చేస్తున్నా. కాబట్టి కొత్త తరహా సినిమాలు తప్పకుండా చేస్తా. నేను ఏదైనా చేయగలను. ఆ నమ్మకం నాకుంది.
దూకుడుకీ ఆగడుకీ మహేష్ బాబుతో రాపో అలానే ఉందా?
ఈరోజు వరకూ ఏ నిర్మాతనీ సినిమా చేస్తానని అడగలేదు. ఫ్లాపులు వచ్చినప్పుడు కూడా నా చేతిలో అయిదుగురు నిర్మాతలు ఉన్నారు. ఫ్లాపులో ఉన్నప్పుడు కూడా ఏ హీరోల వెంట నేను పడలేదు. మహేష్నాకు మంచి ఫ్రెండ్. నాకెప్పుడూ సినిమా ఇవ్వమని అడగలేదు. అడగను కూడా. ఇద్దరికీ అనిపించి చేయాలనుకున్నప్పుడు చేస్తా.
రవితేజతో ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది?
దుబాయ్ శీను తరవాత వరుస హిట్లు వచ్చాయి. వెంట వెంటనే సినిమాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మా ఇద్దరికీ కుదిరింది. రవితేజకు నాపై విపరీతమైన నమ్మకం. నిజంగా నా ట్రబుల్ షూటర్. వెంకీకి ముందు ఓ ఫ్లాప్ వచ్చింది. `అబ్బాయ్ మనం సినిమా చేద్దాం` అని తనే వచ్చాడు. ఢీ సినిమాతో స్ట్రక్ అయినప్పుడు కూడా తనే `వచ్చే నెల మనం సినిమా చేద్దాం` అన్నాడు. నా దగ్గర కథ లేదబ్బాయ్ అంటే. `నువ్వు చేయగలవు` అంటూ ముందుకు నడిపించాడు. ఒక్క నెలలో దుబాయ్ శీను మొదలైంది నేనంటే అంతిష్టం. ఇప్పుడూ అంతే. ది బెస్ట్ ఏం చేయాలో.. అది చేయడానికి ప్రయత్నిస్తా.
ఈమధ్య మీ సినిమాల్లో కామెడీ బాగా తగ్గిందనిపిస్తోంది..
తగ్గిందని నేను కూడా ఫీలయ్యా. ఫేస్ బుక్, ట్విట్టర్లలో కూడా `వింటేజ్ శ్రీనువైట్ల మళ్లీ కావాలి` అని అడుగుంటారు. అలా అడగడం నా అదృష్టం. అది నా మార్క్ కదా. ప్రేక్షకులు ఏం కోరుకుంటే అది ఇవ్వాలి. ఈసారి మాత్రం విపరీతంగా నవ్విస్తాను. మీరు తెరపై చూస్తారు. బ్రాండ్ రావడం ఓరకంగా వరం, అదే శాపం కూడా. కొత్త కథలు చెప్పడం కష్టం కాదు. అందులో నా మార్క్ తగ్గకుండా వినోదాత్మకంగా చెప్పడం చాలా కష్టం. కానీ అది నా బాధ్యత అనుకుంటా.