ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తాను ఈ దేశానికి సచ్ఛీలత నిండిన నిష్కళంకమైన రాజకీయాలను కానుకగా ఇచ్చేస్తాననే రేంజిలో తానొక రాజకీయ ప్రవక్తలాగా సుద్దులు చెబుతూ ఉంటారు. కానీ ఆయన చెప్పే నీతివాక్యాలు ఎలా ఉండేప్పటికీ.. ఆయన పార్టీ మాత్రం.. బురదవేషాలు వేస్తూనే ఉంటుంది. తమకు రాజకీయంగా ఇసుమంత ప్రయోజనం దక్కుతుందనుకుంటే చాలు.. విలువలుగా తాము ప్రచారం చేసే సమస్త అంశాలను తోసిరాజని.. ఎగబడి బురద పులుముకోడానికి ఆ పార్టీ ఉత్సాహపడుతుంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కేరళలో ఎన్నికల సమరాన్ని ఎదుర్కొనబోతున్న భారతీయజనతా పార్టీ క్రికెట్ ఫిక్సింగ్ కుంభకోణంలో కళంకితుడు అయిన శ్రీశాంత్‌ను తమ పార్టీలో చేర్చుకుని, ఎమ్మెల్యే టిక్కెట్ కూడా ఇచ్చి… తద్వారా మైలేజీ దక్కుతుందేమోనని ఉవ్విళ్లూరుతోంది.
క్రికెటర్‌గా బౌలర్ శ్రీశాంత్ కు ఉన్న పేరు ప్రఖ్యాతులు, దక్కిన అపఖ్యాతి, చూసిన ఉత్థాన పతనాలు అందరికీ తెలిసినవే. మంచి బౌలర్‌గా ఎంత వేగంగా శ్రీశాంత్ ఎదిగాడో.. చేజేతులా చేసుకున్న తప్పిదాల కారణంగా అంతే వేగంగా పతనం అయిపోయాడు. ఏదో తనను తాను సమర్థించుకోవడానికి ఫిక్సింగ్ వ్యవహారంలోంచి కోర్టు అతడి పేరును తొలగించింది గానీ.. అతను దోషిగా భావిస్తూ బీసీసీఐ విధించిన నిషేధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ ఫార్మాట్లో కూడా క్రికెట్ ఆడడానికి వీల్లేకుండా అతని మీద నిషేధం ఉంది. అయినా కోర్టు ఎలా భావించినప్పటికీ.. అప్పట్లో ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించిన వీడియోలు చూసిన ప్రతి భారతీయుడు కూడా శ్రీశాంత్ తప్పు చేసినట్టుగా నమ్ముతూనే ఉన్నారు.
అయినా సరే.. కేరళలో రాజకీయంగా తమకు బలం ఎంతమాత్రమూ లేని.. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు శ్రీశాంత్‌ను అక్కునచేర్చుకుంటున్నది. నదిలో కొట్టుకుపోతున్నవాడు గడ్డిపరక దొరికినా దాన్నే పెద్ద ఆధరవుగా భావించినట్లుగా.. కేరళలో శ్రీశాంత్‌ను అమిత్‌షా సమక్షంలో నాలుగుంటలపాటూ సుదీర్ఘమైన భేటీ అనంతరం కమలదళంలో చేర్చుకున్నారు. కులాలు మతాలు కీలక భూమిక పోషించే రాష్ట్రాల్లో ఒకటైన కేరళలో శ్రీశాంత్ తమ పార్టీకి లాభిస్తాడని అమిత్‌షా లెక్కలు కట్టుకుని ఉండవచ్చు. అందుకే ఆయనకు తిరువనంతపురం ఎమ్మెల్యే టిక్కెట్ కూడా ప్రకటించేశారు. కానీ.. శ్రీశాంత్‌ను నెత్తిన పెట్టుకోవడం ద్వారా భాజపా దేశవ్యాప్తంగా మోయవలసి వచ్చే అపకీర్తి మాటేమిటి?
కేరళలో తమ ఖాతా తెరవడానికి భాజపా ఇలాంటి ఎన్ని టక్కు టమార గజకర్ణగోకర్ణ విద్యలనైనా ప్రదర్శిస్తుండవచ్చు గానీ.. అక్కడ మాత్రం ప్రస్తుతానికి వామపక్షాల వారికే అనుకూల పవనాలు ఉన్నట్లుగా ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. మరి మోడీ మంత్రజాలం ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ మేరకు పనిచేస్తుందో.. ఎంతగా మరింత పతనం అవుతుందో వేచిచూడాలి.