బెట్టింగ్ వివాదంలో అప్రదిష్టపాలయిన క్రికెటర్ శ్రీశాంత్, ఆ తరువాత నిర్దోషని రుజువయినప్పటికీ ఆ అపవాదు కారణంగా అతని క్రికెట్ కెరీర్ బాగా దెబ్బ తింది. అయితే ఆ కారణంగానే అతని పేరు దేశమంతటా మారుమ్రోగిపోయింది. మే 16న కేరళ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ కూటమి లేదా వామపక్షాల కూటమి మాత్రమే అధికారం చేజిక్కించుకొంటున్నాయి తప్ప మరో పార్టీకి అవకాశం దక్కడం లేదు. ఈ ఎన్నికలలో కొన్ని సీట్లయినా దక్కించుకొని కేరళలో అడుగుపెట్టాలని భావిస్తున్న భాజపా, ఆ ప్రయత్నంలో భాగంగానే కేరళలో మంచి పేరున్న క్రికెటర్ శ్రీశాంత్ ని తమ పార్టీ తరపున ‘త్రిపునితర’ నియోజక వర్గం నుండి పోటీ చేయవలసిందిగా కోరినట్లు తాజా సమాచారం. ఇది అతనికి ఊహించని అద్భుత అవకాశమనే చెప్పవచ్చు. కనుక అతను సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకొనేందుకు ఒకటి రెండు రోజులు గడువు కోరినట్లు తెలుస్తోంది.