సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ..తమ బేస్ ను.. హోం స్టేడియాన్ని హైదరాబాద్ నుంచి మార్చేయాలని అనుకుంటోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తీవ్రంగా వేధిస్తూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. తమ ఆలోచనలను వివరిస్తూ హెచ్‌సీఏకు సన్ రైజర్స్ టీం లేఖ పంపింది. ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్న సమయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
అంతకు ముందు అంతా బాగుండేదని కానీ జగన్మోహన్ రావు అధ్యక్షుడు అయిన రెండేళ్ల నుంచి తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని రైజర్స్ యాజమాన్యం తెలిపింది. నిబంధనల ప్రకారం ఇచ్చే టిక్కెట్లు మాత్రమే కాకుండా అదనపు బాక్సుల్ని కూడా తమకే ఇవ్వాలని జగన్మోహన్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇటీవల ఓ బాక్సుకు తాళాలు వేయించేశారు . ఈ సందర్భంగా ఆ బాక్స్ వీఐపీలకు కేటాయించడంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇబ్బందులు పడింది. దీంతో ఇక ఏదో ఒకటి తేల్చాలని అనుకుంటోంది.
విశాఖకు ఐపీఎల్ టీం లేదు. ఇప్పుడల్లా వస్తుందన్న నమ్మకం లేదు. అయితే సన్ రైడర్స్ టీం తమ హోం స్టేడియాన్ని మార్చుకోవాలని డిసైడ్ అయితే మాత్రం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి తిరుగులేని ఆఫర్లు వస్తాయని అనుకోవచ్చు. ప్రభుత్వం కూడా కొన్ని రాయితీలు కల్పించేందుకు ముందుకు వస్తుంది. విశాఖ ఓ మంచి అందమైన సిటీ. మంచి క్రేజ్ ఉంటుంది. హెచ్‌సీఏ పాలకవర్గం… పోతే పోయిందని .. ఎస్ఆర్హెచ్ను అలాగే వేధిస్తే.. ఇక సన్ రైజర్స్ విశాఖపట్నం అని పేరు పెట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని అంచనా వేయవచ్చు.