భారీ అంచనాలతో ఐపీఎల్ సీజన్‌ని ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో చతికిల పడింది. స్టార్ బ్యాటర్లు ఉన్నా, భారీ స్కోర్లు చేయలేక ప్రత్యర్థులకు మ్యాచ్‌లు అప్పగించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇలాంటి దశలో హైదరాబాద్ కు ఓ అద్భుతమైన విజయాన్ని అందించాడు అభిషేక్ శర్మ. సుడిగాలి సెంచరీతో అసాధ్యమనుకొన్న లక్ష్యాన్ని సుసాధ్యం చేశాడు. 55 బంతుల్లో 141 పరుగులతో ఉప్పల్ లో పరుగుల సునామీ సృష్టించిన అభిషేక్ హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. అభిషేక్ విజృంభణతో 246 పరుగుల భారీ లక్ష్యాన్ని పది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ లో ఇది రెండో అత్యధిక ఛేదన కావడం విశేషం.
తొలుత టాస్ గెలిచి పంజాబ్‌కు బ్యాటింగ్ అప్పగించింది హైదరాబాద్. అయితే… ఈ నిర్ణయం తప్పేమో అన్నట్టుగా పంజాబ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించే ఈ పిచ్ పై విజృంభించి ఫోర్లు, సిక్సులు బాదారు. శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 245 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు హెడ్ (66), అభిషేక్ (141) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 171 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించారు. అభిషేక్ శర్మ అయితే చెలరేగిపోయాడు. 10 సిక్సులు 14 ఫోర్లతో వన్ మ్యాన్ షో చేశాడు. అభిషేక్ బ్యాటింగ్ పవర్‌కు పంజాబ్ బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు.