ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ రెడ్డి, ఇషాంత్ కిషన్… అందరూ పేరు మోసిన బ్యాటర్లే. ఎడాపెడా సిక్సులు బాదగల సామర్థ్యం ఉన్నవారే. బ్యాటింగ్ లో సన్ రైజర్స్‌కి తిరుగులేదు. పవర్ ప్లేలో దుమ్ముదులపడం, స్లాగ్ ఓవర్స్ లో ఆకాశమే హద్దుగా చెలరేగడం, మిడిల్ ఓవర్లలో సైతం సిక్సులు బాదడంలో సర్‌రైజర్స్ దిట్ట. అందుకే భారీ స్కోర్లు వాళ్ల పాదాక్రాంతం అవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో టాప్ 5 టీమ్ స్కోర్లలో 4 హైదరాబాద్ సొంతం. 20 ఓవర్లలో 300 పరుగులు చేయగల సామర్థ్యం కేవలం హైదరాబాద్ కే ఉందన్నది క్రీడా విశ్లేషకుల మాట. అయితే.. ఇప్పుడు ఈ టీమ్ తీరు చూస్తుంటే, అభిమానుల్లో నిరాశ, నైరాశ్యం ఆవహిస్తున్నాయి. ఈ సీజన్‌ని గెలుపుతో ప్రారంభించిన హైదరబాద్, ఆ తరవాత జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరకు వెళ్లిపోయింది. రాబోయే ప్రతీ మ్యాచ్ హైదరాబాద్ కు కీలకమే. మరో పరాజయం ఎదుర్కొన్నా ప్లే ఆఫ్ అవకాశాలు గగనం అయిపోతాయి.
గురువారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ మరీ పేలవంగా కనిపించింది. కేవలం 120 పరుగులకే ఆలౌట్ అవ్వడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతటి హేమా హేమీలున్న టీమ్, 300 పరుగుల్ని కొట్టగల టీమ్, ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ చేసిన టీమ్.. 120 పరుగులకే చాప చుట్టేయడం ఇబ్బంది పెట్టే విషయమే. హైదరాబాద్ కు ఏదైతే బలం అనుకొన్నారో, అదే ఇప్పుడు బలహీనతగా మారిపోయింది. కోల్ కతా పిచ్ పై 200 పరుగుల్ని ఛేదించడం పెద్ద కష్టమేం కాదు. పైగా హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చూస్తే… 200 పరుగులు ఉఫ్ అని ఊదేస్తారనుకుంటారంతా. కానీ కోల్ కతా బ్యాటర్లు విజృంభించిన చోట, సన్‌రైజర్స్ సరైండర్ అయిపోయింది. ఏదైతే టీమ్ కు బలం అనుకొన్నారో, అదే శాపంగా మారిపోయింది.
ఓపెనర్లు అడ్డదిడ్డంగా బ్యాట్లు ఊపడం వల్ల, టైమింగ్ మిస్ అవ్వడం వల్ల ఔటైపోయారు. టాప్ ఆర్డర్ పరిస్థితి కూడా అంతే. ఒక్కరు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడలేకపోతున్నారు. ‘బ్యాటింగ్ లో మనకు తిరుగులేదు’ అనే ఓవర్ కాన్ఫిడెన్సే… టీమ్ ని దెబ్బతీస్తోంది. ‘నేను ఔటైనా ఇంకొకరు ఉన్నారులే’ అనే ధీమా తప్పుదోవ పట్టిస్తోంది. అటాకింగ్ ప్లే అన్నివేళలా సరైనది కాదు. ఈ విషయాన్ని హైదరాబాద్ టీమ్ తెలుసుకోవాలి. లేకపోతే ఎంత బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నా ఉపయోగం లేదు. బౌలింగ్ లో హైదరాబాద్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఫీల్డింగ్ లో ఇదివరకటి ప్రమాణాలు లేవు. కోల్ కతా మ్యాచ్‌లో కీలకమైన క్యాచ్‌లు జారవిడిచారు. దానికి భారీమూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది.
రాబోయే మ్యాచ్‌లు జట్టుకి చాలా కీలకం. బ్యాటింగ్ పై శ్రద్ధ పెట్టాలి. బౌలింగ్ ని మరింత పదును చేసుకోవాలి. ఫీల్డింగ్ లో లోపాలు సరిదిద్దుకోవాలి. లేదంటే… కప్పు మాట దేవుడు ఎరుగు. కనీసం ప్లే ఆఫ్‌లో స్థానం కూడా కోల్పోవాల్సివస్తుంది.