ముందస్తు ఎన్నికల హడావుడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా ముందుగానే ప్రారంభమయింది. కీలకమైన అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరన్నదానిపై.. ఆయా పార్టీలు కసరత్తులు అంతర్గతంగా కసరత్తులు ప్రారంభించేశాయి కూడా. అందుకే.. తరచూ కొన్ని కీలక స్థానాలపై.. సమాచారం బయటకు వస్తూ ఉంది. చంద్రబాబు.. రాజధాని జిల్లాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం దగ్గర్నుంచి.. లగడపాటి అసెంబ్లీలో బరిలో ఉంటారన్న సమాచారం వరకూ.. అన్నీ ఇలాంటివే. పార్టీల్లో విస్త్రతంగా జరుగుతున్న చర్చల మేరకు బయటకు వస్తున్న విశేషాలే. అయితే తెలుగుదేశం పార్టీ తరపున ఈ సారి.. యువనేతలు ఎక్కువగా బరిలోకి దిగబోతున్నారనేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఈ యువ వారసత్వపు నేతల జాబితాలో కొత్తగా చేరిన పేరు .. మతుకుమిల్లి భరత్. ఈయన ఎవరో కాదు.. బాలకృష్ణ చిన్న అల్లుడు. కావూరి సాంబశివరావు, ఎంవీవీఎస్ మూర్తిల మనవడు.
విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి ఏపీలోనే ప్రత్యేకత ఉంది. అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై ఇప్పటి నుంచే చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నేత హరిబాబు ఉన్నప్పటికీ.. ఆ పార్టీ గురించి పట్టించుకునేవారు లేరు. టీడీపీ తరపున ఎవరు..? వైసీపీ తరపున ఎవరు అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున ఎంవీవీఎస్ మూర్తి పేరు పరిశీలనకు వస్తోంది. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. చంద్రబాబు యువతరాన్ని తెలుగుదేశం పార్టీ కోసం సిద్దం చేయాలనుకుంటున్నారు. అందుకే.. ప్రత్యామ్నాయంగా.. భరత్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గీతం యూనివర్శిటీకి సంబంధించి కీలక బాధ్యతలను.. భరత్ చూసుకుంటున్నారు. భరత్‌కు అన్ని వైపుల నుంచి రాజకీయ నేపధ్యం ఉంది. తండ్రి ఎంవీవీఎస్ మూర్తి కుమారుడు. తల్లి .. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశిరావు కుమార్తె. ఇక భరత్ మామ.. స్వయానా ఎన్టీఆర్ కుమారుడైన.. ఎమ్మెల్యే బాలకృష్ణ. ఏ విధంగా చూసినా.. భరత్‌కు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నట్లే లెక్క.
అందుకే.. భరత్ పేరు విస్త్రతంగా ప్రచారంలోకి వచ్చేస్తోంది. అదే సమయంలో వైసీపీ తరపున ఎవరన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. కొన్నాళ్లుగా .. విజయసాయిరెడ్డి.. విశాఖ మీదే దృష్టి పెట్టారు. దాన్ని బట్టి చూస్తే.. ఆయన బరిలోకి దిగుతారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన తన సమీప బంధువు, ప్రముఖ ఫార్మా కంపెనీ యజమాని అయిన నిత్యానందరెడ్డి కోసం.. కష్టపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో .. బీజేపీ తరపున … విశాఖ నుంచి అంతకు ముందు గెలిచిన.. పురంధేశ్వరి రంగంలో ఉంటే.. కాస్త విభిన్నమైన రాజకీయ పరిస్థితులే ఉంటాయని భావిస్తున్నారు.