ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయో.. అక్కడ కాలనీలు ఏర్పడతాయి. అన్ని వాణిజ్య, వ్యాపార వ్యవహారాలు పెరుగుతాయి.దీనికి సాక్ష్యం శ్రీసిటీ. చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ ఇండస్ట్రియల్, బిజినెస్ హబ్ శ్రీసిటీ. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల కంపెనీలు ఇక్కడ తమ తయారీ యూనిట్లను పెట్టాయి. ఇంకా పెట్టబోతున్నాయి. అందుకే కొన్నేళ్లుగా ఈ ప్రాంతం గణనీయమైన అభివృద్ధిని సాధించింది.
శ్రీసిటీలో పరిశ్రమలు పెరగడం వల్ల ఆ చుట్టుపక్కల ఇళ్లు, వాణిజ్య స్థలాల డిమాండ్ ఎక్కువగా ఉంది. రోడ్లు, రవాణా సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ విలువలను పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీసిటీని ఒక ఆర్థిక కేంద్రంగా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం అందించే రాయితీలు, పన్ను ప్రయోజనాలు రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను మరింత బలోపేతం చేయనున్నాయి.
శ్రీసిటీ సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ తక్కువ ధరలకే.. ఇంకా చెప్పాలంటే గజం ఐదు వేలకే లభిస్తున్నాయి. శ్రీసిటీకి దగ్గరగా, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పదివేల వరకూ ఉంటున్నాయి. అపార్టుమెంట్లు పాతిక నుంచి నలభై లక్షలలోపు లభిస్తున్నాయి. ఇళ్ల స్థాయి, సౌకర్యాలను బట్టి విలువ మారుతోంది. శ్రీసిటీలోని అపార్ట్మెంట్లు ప్రధానంగా ఉద్యోగులు, వ్యాపారవేత్తల కోసం నిర్మిస్తున్నారు.
వరదయ్యపాలెంలో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. శ్రీసిటీకి 15-20 కి.మీ దూరంలో ఉంది. సత్యవేడు ఉంటుంది. గ్రామీణ వాతావరణంలో ఉండాలనుకునేవారికి బాగుంటుంది. శ్రీసిటీ లోపల రెసిడెన్షియల్ జోన్ ఉంది. రాబోయే సంవత్సరాల్లో శ్రీసిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత మెరుగవుతుంది కాబట్టి, ధరలు పెరిగే అవకాశం ఉందని రియల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.