శ్రీదివ్య తెలుగు అమ్మాయే అయినా.. ఈమధ్య తమిళంలోనే ఎక్కువ మెరుస్తోంది. దాదాపు తమిళ అమ్మాయిగానే చలామణీ అవుతోంది. తమిళ సినమాలు చేస్తూ, తమిళంలో మాట్లాడేస్తూ అక్కడివాళ్లకు దగ్గరైపోయింది. ‘అదేంటి? అందరూ తమిళం నుంచి ఇటొస్తే.. మీరు ఇటు నుంచి అటెళ్లిపోయారేంటి?’ అని అడిగితే.. ”అక్కడి నుంచి మంచి అవకాశాలొస్తున్నాయి. నా మనసుకు నచ్చిన పాత్రలు దక్కుతున్నాయి. అందుకే తమిళంలో నటిస్తున్నా. తెలుగులో ప్రాధాన్యత ఉన్న కథానాయిక పాత్రలు రావడం లేదు. తెలుగమ్మాయి అయ్యిండి.. తెలుగులో నటించలేకపోతున్నందుకు బాధగా ఉంది” అని చెప్పుకొచ్చింది.
శ్రీదివ్య నటించిన మరో అనువాద చిత్రం రాయుడు ఇప్పుడు విడుదలకు రెడీ అయ్యింది. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో అయినా తెలుగులో తనకు మంచి అవకాశాలు వెదుక్కొంటూ వస్తాయన్న నమ్మకం వ్యక్తం చేసింది శ్రీదివ్య. తమిళంలో కథానాయిక పాత్రకు అంతో ఇంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, అలా ఇచ్చిన సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయని, తెలుగులోనూ ఆ మార్పు తప్పక వస్తుందని చెబుతోంది శ్రీదివ్య. ఆమె నటించిన పెన్సిల్ ఆమద్యే విడుదలై ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ అయినందకు చాలా బాధగా ఉందని, ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ వేస్ట్ అయినందుకు ఫీలవుతున్నానని చెప్పుకొచ్చింది. మరి రాయుడు ఏమవుతుందో?