శ్రీకృష్ణాష్టమి. అంటే శ్రీకృష్ణుడు పుట్టినరోజు. క్రీస్తు పూర్వం 3,228 సంవత్సరాల క్రిందట అష్టమి తిధినాడు పుట్టిన వ్యక్తిని నేటికీ మనం ఎందుకు గుర్తుచేసుకుంటున్నాము? ఆయన పుట్టినరోజుని పండుగరోజుగా ఎందుకని జరుపుకుంటున్నాము ? అసలు ఈప్రశ్నలే తప్పని వాదించే వాళ్లే ఎక్కువ. `శ్రీకృష్ణడు దేవుడు కనుక ఆయన పుట్టినరోజును పండుగగా జరుపుకుంటున్నాం, ఈమాత్రం తెలియదా?’ అంటూ ఎదురుప్రశ్నవేయవచ్చు. శ్రీకృష్ణుడు మహావిష్ణువు అవతారమే కావచ్చు. ఆయనలో దేవతాంశ ఉండవచ్చు. అయితే, ఆయన మానవునిగా పుట్టాడు. మానవునిగానే పెరిగాడు. అందరిలా కష్టసుఖాలు అనుభవించాడు. చివరకు బోయవాడి బాణందెబ్బకు కన్నుమూశాడు. మానవుడే అయినా దేవునిగానే ఇప్పటికీ కీర్తించబడుతున్నాడు.
శ్రీకృష్ణుడిని దేవుడని అనుకునేది ఎందుకంటే – పదహారువేలమంది గోపికలతో బృందావనంలో తిరగాడినందుకు కాదు, అష్టభార్యలతో అష్టైశ్వర్యాలతో తులతూగినందుకూ కాదు, పూతనాది రాక్షసులను వధించినందుకు కానేకాదు, చివరకు అర్జునుడిచేత మహాభారతయుద్దం చేయించినందుకు అంతకన్నా కాదు. మరి ఎలా ఆయన దేవుడయ్యాడు ? ఆయన జన్మించి ఇన్నివేల సంవత్సరాలైనప్పటికీ నేటికీ అందరి మనస్సుల్లో ఏలా సుస్థిరస్థానం సంపాదించుకోగలిగాడు ?
శ్రీకృష్ణుడ్ని దేవుడిగా భావించడానికి ప్రధాన కారణం ఆయనలోని స్థితప్రజ్ఞత. ఎటువంటి పరిస్థితికైనా చెలించకుండాఉండే గుణం శ్రీకృష్ణుడిలో చాలా ఎక్కువగాఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మోముపై చిరునవ్వు చెదరదు. ఆయన చేతిలోని పిల్లనగ్రోవి ఆలాపనలో ఎలాంటి మార్పురాలేదు.
వేలాది రాజుల సమక్షంలో తనను అగ్రపీఠంపై కూర్చోబెట్టినప్పుడూ, తన కళ్లముందు ద్వారకాపట్టణం సముద్రంలో క్రుంగిపోతున్నప్పుడూ అదే చిరునవ్వు.
శ్రీకృష్ణునిజీవితం పూలపాన్పుకాదు. పసిగుడ్డుగా ఉన్నప్పటినుంచీ జీవన్మరణ సమస్యే. మేనమామ కంసుడు ఈ పిల్లాడ్ని వధించాలని ఎన్నో వ్యూహాలు పన్నాడు. పూతనను పంపాడు, శకటాసురుణ్ణి పంపించాడు. బకాసురుడు, వృషభాసురులను ఉసిగొలిపాడు. ఈ రక్కసిమూకతో పోరాడతేనేగాని విజయం కృష్ణుడికి దక్కలేదు. ఏదోఒక మహిమచూపో, లేదా మంత్రం జపించో రాక్షసవధ చేయలేదు. ఆయనలోని దైవశక్తిని ఈ కార్యాలకు ఉపయోగించలేదు. మానవశక్తినే నమ్ముకుని పోరాడి విజయం సాధించాడు. చిరునవ్వుతోనే సవాళ్లను స్వాగతించాడు. ఆత్మబలంతోనే అంతిమ విజయం తనదనిపించుకున్నాడు. సమస్య తలెత్తినప్పుడూ అదే నవ్వు… గెలిచిన తర్వాత కూడా అంతే చిరునవ్వు. ఇదే శ్రీకృష్ణ తత్వం. ఇది శ్రీకృష్ణతన్మయానంద తత్వం.
`మేనేజ్ మెంట్ గురు’ శ్రీకృష్ణ
ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కూడా శ్రీకృష్ణుడు మేనేజ్ మెంట్ గురువే. ఎందుకంటే…
1. మేనేజ్ మెంట్ గురువన్నవాడు సమస్యలకు, సవాళ్లకు భయపడిపారిపోకూడదు. చివరివరకు విజయం మనదేనన్న భావంతో పోరాడాలి. గోకులంలో ఉన్నప్పుడు ఊరి సమస్యను తనదిగా భావించిన శ్రీకృష్ణుడు యమునలోని నీటిని కాలుష్యపరుస్తున్న కాళీయుడనే సర్పరాజు పడగలపై మర్ధనంచేసి ఆ విషాన్ని కక్కిస్తాడు. అలాగే, మరో సందర్బంలో తనవారిని కాచడానికి గోవర్థన గిరిని పెకిలించి పైకిలేపుతాడు. ఒకరోజుకాదు, రెండురోజులుకాదు, ఏడురోజులపాటు పర్వతాన్ని ఒంటిచేత్తో చిటికినవేలిపై అలా మోస్తూనే ఉన్నాడు. ఎవరికోసం ? తనను నమ్ముకున్నవారికోసమే. కష్టమైనపనే అయినా ఆయన మోముపై చిరునవ్వు చెదరలేదు. సవాళ్లు వచ్చినప్పుడు తానప భయపడకుండా నిలబడి అందర్నీ రక్షించినందునే ఆయన అందరికీ `గురు’దేవుడయ్యాడు.
2. విశ్రాంతిలేని పోరాటాలు జీవితంలో తప్పవు. అలాఅని చిటపటలాడకూడదు. క్షణం విశ్రాంతిలేకపోయినా చిరునవ్వు చెక్కుచెదరనీయకూడదు. ఈ లక్షణం శ్రీకృష్ణుడిలో అపారం. ఉదాహరణకు జరాసంధునితో 17సార్లు యుద్దం చేశాడు. యుద్దంచేసిన ప్రతిసారీ జరాసంధుడు పారిపోయేవాడు. కానీ మళ్ళీ బలంపుంజుకుని యుద్ధానికి సై అనేవాడు. దీంతో వరుస యుద్ధాలు తప్పలేదు.
3. తనను నమ్ముకునే వారికి ఆనందం పంచిపెట్టాలి. శ్రీకృష్ణుడు తన అష్టభార్యలనేకాదు, మిత్రుడైన కుచేలుడి నుంచి నాలుగు పిడికెళ్ల అటుకులు తీసుకుని అష్టైశ్వర్యాలను చేకూర్చాడు. తననే నమ్ముకున్న ద్రౌపదికి మానసంరక్షణగావించాడు.
4. ధర్మసంస్థాపనకోసం తపించడం. మహాభారతయుద్ధం ప్రారంభవేళ అర్జునికి కలిగిన సందేహాలు తీర్చాడు శ్రీకృష్ణుడు. బంధువులు, మిత్రులు, గురువులు…వీరందరికంటే ధర్మమే గొప్పదని చెప్పి యుద్ధానికి సిద్దంచేశాడు.
5. వైఫల్యం ముంచుకొస్తున్నా చలించని నైజం. మరికొద్దిరోజుల్లో ద్వారకానగరం మునిగిపోతుందనీ, ముసలంపుట్టి యాదవ వంశమే సర్వనాశనం అయిపోతుందని తెలిసినప్పటికీ స్థితప్రజ్ఞతతో , అదే చిరునవ్వుతో ఫలితాన్ని కాలపురుషునికే వదిలేయగలగడం కృష్ణునికే సాధ్యమైంది. అందుకే ఆయన కృష్ణపరమాత్మ అయ్యాడు. చివరకు తన మరణాన్ని కూడా చిరునవ్వుతోనే స్వాగతించగలిగాడు.
శ్రీకృష్ణుడ్ని దేవునిగా మార్చింది ఆయన చిరునవ్వే. జీవితాంతం వరకు నవ్వుతూ బతకాలన్నదే ఆయన తత్వం. అదే మానవాళికి నిత్యమార్గదర్శనం.
– కణ్వస
kanvasa19@gmail.com