అగ్ర హీరోల నుంచి యువ హీరోలు స్ఫూర్తి పొందుతున్నారు. వాళ్ల అడుగుజాడల్లోనే నటిస్తున్నారు. మల్టీస్టారర్ కథలకు సిద్ధమే అంటూ… స్టార్ హీరోలు ఎప్పుడో ప్రకటించేశారు. అవకాశాలొస్తే కలసి నటించడానికి రెడీ అంటున్నారు. ఆ స్టార్లని ఇప్పటి యంగ్ బ్యాచ్ ఫాలో అయిపోతోంది. దాంతో యంగ్ మల్టీస్టారర్లు వస్తున్నాయి. ఈ కోవలో మరో సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈసారి ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు హీరోలు కలసి సందడి చేయబోతున్నారు. వాళ్లే సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, సుధీర్ బాబు. ఈ యంగ్ హీరోల మల్టీస్టారర్ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.
భలే మంచి రోజు తో తెరంగేట్రం చేసిన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ సమయంలోనే సుధీర్‌బాబుకి మరో కథ చెప్పాడు. ఈ కథకు మరో ముగ్గురు హీరోల తోడు అవసరమైంది. ఈ కథ విన్న భవ్య ఆర్ట్స్ నిర్మాత ఆనంద్ ప్రసాద్ వెంటనే ఇన్స్పైర్ అయి.. వెంటనే ఓకే చెప్పేశాడట. ఆ తరవాత ఈ స్టోరీ సందీప్ కిషన్ దగ్గరకు వెళ్లింది. తన రికమెండేషన్‌తో నారా రోహిత్ ఈ కథ విని, ఓ కీలక పాత్ర చేయడానికి ముందుకు వచ్చాడట. మరో హీరో పాత్ర సాయికుమార్ తనయుడు ఆదికి దక్కింది. అలా.. నలుగురు హీరోలూ సెట్ అయిపోయారు. ఇది కూడా ఓ క్రైమ్ థ్రిల్లర్ తరహా కథేనని తెలుస్తోంది. ఈనెలలోనే చిత్రానికి కొబ్బరికాయ్ కొట్టేయబోతున్నారు. ఈ నలుగురు హీరోల పక్కన నలుగురు హీరోయిన్లని వెదికే పనిలో పడింది చిత్రబృందం. మొత్తానికి మరో క్రేజీ కాంబినేషన్‌కి రంగం సిద్ధమైపోతోంది. మరి ఈ నలుగురు హీరోలు కలసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.