గత రెండు మూడు వారాలుగా శ్రీరెడ్డి పేరు న్యూస్ ఛానళ్లలోనూ, సోషల్ మీడియాలోనూ మార్మోగిపోతోంది. టీవీ ఛానల్ డిబేట్లలో పాల్గొంటూ సినీ పరిశ్రమలోని వ్యక్తులపై ఘాటైన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అందరి దృష్టినీ ఆకర్షించింది. తప్పో – రైటో శ్రీరెడ్డి గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. తన చేతిలో చాలామంది హీరోల, దర్శకుల జాతకాలున్నాయని చాలామంది నమ్మకం. అదేమో తెలీదుగానీ… దర్శకుడు తేజ నుంచి శ్రీరెడ్డికి పిలుపొచ్చింది. టీవీ ఛానళ్ల ద్వారా శ్రీరెడ్డి గురించి తెలుసుకున్న తేజ… ఆమెని పిలిచి మరీ రెండు అవకాశాలిచ్చారు. అంతేకాదు.. ”మిగిలినవాళ్లూ ఇవ్వాల్సిందే” అంటూ అల్టిమేట్టం లాంటిది జారీ చేశారు.
”శ్రీరెడ్డికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నా. చాలా బాధేసింది. ఆమెకు ఎవరెవరు అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేశారో, వాళ్లంంతా ఆమెకు అవకాశాలు ఇవ్వాల్సిందే. నేనిప్పుడు రెండు సినిమాలు చేస్తున్నా. రెండింటిలోనూ ఆమెకు మంచి పాత్రలు ఇచ్చా. మిగిలినవాళ్లూ ఇవ్వాల్సిందే. మన పరిశ్రమలో ఉన్న మన అమ్మాయిని ముందు కాపాడుకోవాలి. ఆ తరవాతే.. మిగిలినవాళ్లు” అంటూ మిగిలినవాళ్లకు క్లాస్ పీకాడు తేజ. ఇందుకు సంబంధించి ఓ వీడియో బైట్‌ని కూడా రిలీజ్ చేశాడు. వెంకటేష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు తేజ. ఎన్టీఆర్ బయోపిక్‌కీ తనే దర్శకుడు. అంటే ఈ రెండు సినిమాల్లోనూ శ్రీరెడ్డి కనిపించబోతోందన్నమాట. మొత్తానికి శ్రీరెడ్డి పంట పండింది. ఇక.. వరుసగా అవకాశాలు తలుపుతట్టడం ఖాయం.