అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటోనిన్ స్కాలియ (79) ఆదివారంనాడు ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన శ్రీ శ్రీనివాసన్ ని నియమించే అవకాశాలు కనబడుతున్నాయి.
ఆయన ఫిబ్రవరి 23,1967లో చండీఘడ్ లో జన్మించారు. ఆయన తల్లితండ్రులు తమిళనాడులోని తిరున్వెయిల్ కి చెందినవారు. ఆయన జన్మించిన తరువాత వారిరువురూ తమ ఇద్దరు కుమార్తెలతో సహా అమెరికాలోని లారెన్స్, కన్సాస్ కి వలసవెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. ఆయన తండ్రి యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్ లో గణితశాస్త్రం భోదించేవారు. శ్రీ శ్రీనివాసన్ తల్లి కన్సాస్ సిటీ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ లో, ఆ తరువాత యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్ లో కంప్యూటర్ సైన్స్ భోదించేవారు.
శ్రీ శ్రీనివాసన్ లారెన్స్ లోని లారెన్స్ హైస్కూల్ లో 10వ తరగతి చదువుకొన్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత, స్టాన్ ఫోర్డ్ లా స్కూల్ లో జె.డి., స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి 1995లో ఎం.బి.ఏ. పూర్తి చేసారు.
ఆయన 2013లో యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ సర్క్యూట్ జడ్జిగా దాదాపు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన అమెరికా ప్రధాన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గా పనిచేసారు. శ్రీ శ్రీనివాసన్ చాలా ప్రతిభావంతుడని అమెరికా న్యాయ నిపుణుల అభిప్రాయం. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా ఆయనను అనేక సార్లు మెచ్చుకొన్నారు. యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ సర్క్యూట్ జడ్జిగా ఒబామాయే ఆయనని ప్రతిపాదించినపుడు 97 శాతం మెజారిటీతో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
అంటోనిన్ స్కాలియ స్థానంలో అర్హుడయిన వ్యక్తిని నియమించవలసిన బాధ్యత తనపై ఉందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా చెప్పారు. శ్రీ శ్రీనివాసన్ కి ఒబామా మద్దతు, మంచి అనుభవం, ప్రతిభ అన్నీ ఉన్నందున ఆయననే అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అవకాశాలు కనబడుతున్నాయి. అదే జరిగితే అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారిగా భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేపట్టిన్నట్లు అవుతుంది.