తెలుగు వారికి కొత్త ఏడాది వచ్చేసింది. శ్రీశుభకృత్ నామ సంవత్సరం అందరికీ సుఖాలు.. సంతోషాలు.. ధనం కల్పించాలని అందరూ ఆశీర్వదిస్తారు. కోరుకుంటారు. కానీ కొత్త ఏడాది కదా అని పాతవన్నీ మర్చిపోయి కొత్తగా ప్రారంభించడానికి అవకాశం లేదు. గత ఏడాది భారాన్ని మోసుకుని కొత్త ఏడాదిలోకి రావాల్సిందే. ఆ భారం మరీ ఎక్కువయితే పండగ సంబరం ఉండదు. ప్రస్తుతం తెలుగు ప్రజలకు ఇలాంటి పరిస్థితే ఉంది. పాత కష్టాలన్నీ తొలగకపోగా పెరిగిపోయాయి. ఆ లగేజీతో కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్నారు. దానికి తోడు కొత్తగా ఈ రోజు నుంచే ప్రభుత్వాలు వేస్తున్న అదనపు భారాలు చేరిపోయాయి. ఈ కష్టాలతో ఎంత కాలం పరుగెడుతామో.. ఎప్పుడు కుప్పకూలుతామో తెలియని స్థితిలో ప్రజలు చేరిపోయారు.
గతంలో ఉగాది పండుగంటే ఎక్కడ మార్కెట్లు కిట కిటలాడిపోయేవి. దుస్తుల దుకాణాలు కిక్కిరిసిపోయేవి. కానీ ఇప్పుడు ఆ తరహా పరిస్థితి కనిపించడం లేదు. ఆ ప్రజలు పండుగ చేసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. పెరిగిన ధరల భారం.. పెరగని ఆదాయం.. అదనంగా పన్నుల భారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని అనుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజల జీవితాలను సాఫీ చేయకపోగా.. మరింత కష్టపెడుతున్నారు. చిత్ర విచిత్రమైన నిర్ణయాలతో తంటాలు పెడుతున్నారు. చివరికి సమయానికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఉద్యోగులకే పండుగ ఆనందం ఉండటం లేదు.. ఇక సామాన్యులకేమి ఉంటుంది.
కరోనా దెబ్బకు గత రెండేళ్లుగా ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. ఆ వైరస్‌కు తోడు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలు ప్రజల్ని పన్నుల రూపంలో దెబ్బకొట్టడం ప్రారంభించాయి. రోజు రోజుకు జీవనం భారం అవుతోంది. అయితే కరోనా పరిస్థితి పూర్తిగా తగ్గిపోయింది. మాస్క్‌లు కూడా అవసరం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలని… త్వరలోనే మళ్లీ ప్రజల కష్టాలన్నీ తొలగి పోవాలని కోరకుంది. శ్రీశుభకృత్ నామ సంవత్సరం ఆ పాత కష్టాలన్నింటినీ తీర్చేసి.. కొత్తగా మార్చేస్తుందని ఆశిద్దాం..!