స్టార్ డమ్ ఎవరికైనా ఒకేలా పనిచేస్తుంది. క్రేజ్, ఇమేజ్ వచ్చేశాక… `నేను ఆడిందే ఆట` అంటారంతా. అయితే చిత్రసీమ హీరోల రాజ్యం. ఎప్పుడోగానీ హీరోయిన్లకు చక్రం తిప్పే అవకాశం రాదు. వస్తే మాత్రం విచ్చలవిడిగా వాడుకోవాల్సిందే. దానికి అద్భుతమైన ఉదాహరణ శ్రీదేవి.
శ్రీదేవి స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా… తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ల జాబితాలో తొలి వరుసలోనే ఉండేది. శ్రీదేవి కాల్షీట్లని బట్టే.. స్టార్ హీరోల సినిమాలు ఫిక్సయ్యేవి. అదీ.. శ్రీదేవి రేంజు. అప్పట్లో తన క్రేజ్ ఎలా ఉండేది అనేదానికి ఓ మచ్చుతునక ఇది.
చిరంజీవి నటించిన ‘కొండవీటి దొంగ’ సినిమా గుర్తుండే ఉంటుంది. విజయశాంతి – రాధ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. నిజానికి ఈ సినిమాలో కథానాయికగా ముందు శ్రీదేవినే అనుకున్నార్ట. శ్రీదేవిని దృష్టిలో ఉంచుకుని హీరోయిన్ పాత్రని డిజైన్ చేసి, శ్రీదేవి దగ్గరకు వెళ్తే…. ”కథ బాగుంది గానీ.. టైటిల్ మార్చండి. కొండవీటి దొంగ, కొండవీటి రాణి అని పెట్టండి” అని చెప్పిందట. చిరంజీవి హీరో కాబట్టి కొండవీటి దొంగ అనే టైటిల్ ముందే ఫిక్స్ చేసేశారు. కానీ.. శ్రీదేవి.. టైటిల్ తనపై కూడా ఉండాల్సిందే అని పట్టుపట్టింది. దాంతో… శ్రీదేవిని పక్కన పెట్టాల్సివచ్చింది. శ్రీదేవి ఎప్పుడైతే తప్పుకుందో అప్పుడు ఈ సినిమాలో కథానాయిక పాత్రని మార్చేసి, సోలో హీరోయిన్ సినిమా కాస్తా.. ఇద్దరు హీరోయిన్ల కథగా మార్చారు. అదే ఇప్పుడైతే.. `నా కోసం టైటిల్ మార్చండి` అని ధైర్యంగా అడిగే కథానాయిక ఉంటుందా? దటీజ్ శ్రీదేవి.