సెలబ్రెటీల జీవితాలు ఇంతేనేమో. వాళ్ల మరణం కూడా… సినిమాలకు ధీటుగా ట్విస్టులు, టర్న్‌లతో సాగుతుంటుంది. ఎవరు చనిపోయినా.. ‘ఇంకో కోణం ఏమైనా ఉందేమో’ అనే అనుమానాలు రేగడం సర్వసాధారణం. ప్రస్తుతం శ్రీదేవి విషయంలోనూ అదే జరుగుతోంది. ఆదివారం ‘శ్రీదేవి మరణ’ వార్తతో మేల్కొంది. శ్రీదేవికి హార్ట్ ఎటాక్ అంటే అంతా ఆశ్చర్యపోయారు. శ్రీదేవి అంత ఆరోగ్యంగా కనిపిస్తోంది కదా, ఇంత చిన్న వయసులో ఆమెకేం వచ్చింది? అంటూ విస్తుబోయారు. ‘అందాలు రక్షించుకోవడానికి ఏవో ట్రీట్మెంట్లు తీసుకొంటోందట… అవికాస్త విషంగా మారాయి’ అంటూ మరో వాదన బలంగా వినిపించింది.. ఇవన్నీ నిజమో కాబోసు అనుకున్నారంతా.
కానీ ఇప్పుడిప్పుడే శ్రీదేవి మరణం తాలుకూ వాస్తవాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీదేవిది సహజమరణం కాదని. ప్రమాదవశాత్తూ మరణించిందని పోస్ట్ మార్టమ్ రిపోర్టులో తేలింది. ఎప్పుడైతే ఆ వార్త బయటకు వచ్చిందో.. శ్రీదేవి మరణం మరింత హాట్ టాపిక్ అయిపోయింది. శ్రీదేవి ఎలా చనిపోయిందబ్బా..? అంటూ ఎవరికి నచ్చిన ఊహాగానాలు వాళ్లు చేసుకోవడమ మొదలెట్టారు. ఆ తరవాత శ్రీదేవి శరీరంలో ఆల్కాహాల్ కంటెంట్ ఉందని తేలింది. మద్యం మత్తులో బాత్ రూమ్ టబ్‌లో పడి చనిపోయిందన్నది డాక్టర్లు చెప్పిన మాట. మరి బాత్ రూమ్ టబ్‌లో పడిపోతే తలకు బలమైన గాయమేమైనా ఉండాలి కదా.. అనేది మరో బలమైన అనుమానం.
దుబాయ్ పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అక్కడ ఎలాంటి పొరపాట్లూ జరగవు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌ని ఏమాత్రం తప్పుబట్టడానికి వీలుండదు. వాళ్లన్నీ నిజాలే చెబుతారని అందరి నమ్మకం. దాన్ని బట్టి చూస్తే శ్రీదేవిది సహజమరణమే కావొచ్చు. కానీ దుబాయ్ పోలీసులు బోనీ కపూర్‌ని ఏకంగా మూడు గంటల పాటు ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సహజమరణమే అయినప్పుడు ఆ స్థాయిలో ఇంటరాగేషన్ చేయడం ఎందుకు? పైగా ‘శ్రీదేవి హార్ట్ ఎటాక్‌తో మరణించింది’ అంటూ ముందు ఓ వార్త వచ్చింది. దానికి కారణం.. శ్రీదేవి కుటుంబ సభ్యులే. శ్రీదేవి ఎలా చనిపోయిందన్న విషయంలో ముందుగా అబద్దం ఎందుకు చెప్పాల్సివచ్చిందన్నది మరో ప్రశ్న. ‘అసలు శ్రీదేవికి మద్యం సేవించే అలవాటే లేదు’ అనే మరో బలమైన వాదన కూడా ఇప్పుడిప్పుడే వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలే. సమాధానం లేని ప్రశ్నలు. మరి ఈ చిక్కుముడులు విప్పేదెప్పుడో..??