జగదేక వీరుడు – అతిలోక సుందరి. ఓ క్లాసిక్. మైల్ స్టోన్. సోషియో ఫాంటసీ సినిమాలకు దిక్చూచీ. చిరు – శ్రీదేవి కెమిస్ట్రీ, ఇళయరాజా పాటలు, రాఘవేంద్రరావు మాయాజాలం, అమ్రిష్ పురి విలనిజం – ఒక్కటేంటి.. అన్నీ సూపరే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేయాలన్నది ఆలోచన. ఇది ఇప్పుడొచ్చిన ఐడియా కాదు. గత నాలుగైదేళ్ల నుంచీ అశ్వనీదత్ మదిలో చక్కర్లు కొడుతూనే ఉంది. కానీ.. అదంత ఈజీ కాకపోవొచ్చు.
చిరంజీవి ప్లేసులో రామ్ చరణ్ ని చూస్తున్నప్పుడు అభిమానులు పెద్దగా కంప్లైంట్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే చిరు వారసుడిగా చరణ్‌ని ఎప్పుడో అంగీకరించేశారు. కానీ.. శ్రీదేవికి రీ ప్లేస్ మెంట్ ఏది? అతిలోక సుందరి అనే ట్యాగ్ లైన్ ఈ తరంలో ఏ కథానాయికకు ఇవ్వగలం? ఇచ్చినా ప్రేక్షకులు చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? అసలు అతిలోక సుందరి అనే టైటిల్ శ్రీదేవికి తప్ప ఇంకెవ్వరికీ నప్పదు. శ్రీదేవి అంత అందమైన హీరోయిన్లు దొరక్క కాదు. దేవకన్యగా, ఇంద్రుడి తనయగా ఆ ఆహార్యం, ఆకర్షణ.. శ్రీదేవి తప్ప ఇంకెవ్వరూ మ్యాచ్ చేయలేరన్నది ఒప్పుకోక తప్పని నిజం. మానవా.. అంటూ శ్రీదేవి పలవరించిన పద్ధతి – ఆమె అమాయకత్వం, మురిపాలు – ఇంకొకరు చూపించలేరు. ఆఖరికి శ్రీదేవి వారసురాలు కూడా.
చిరు వారసుడిగా చరణ్‌ని తీసుకొచ్చి, శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ ని జంటగా చేర్చి `జగదేక వీరుడు – అతిలోక సుందరి` అనే టైటిల్ పెట్టేస్తే `సర్దుకుపోవొచ్చు`గాక… కానీ ఎక్కడో, ఏదో ఓ చోట శ్రీదేవి లేని వెలితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే.. ఆ పాత్రలో శ్రీదేవి చేసిన మాయాజాలం అలాంటిది. సీక్వెల్ కి సరిపడా కథని ఎలాగైనా పుట్టించేయొచ్చు. అదేం పెద్ద సమస్య కాదు. గ్రాఫిక్స్ అంటారా? ఈసారి… హాలీవుడ్ స్థాయిలో తెరపై విన్యాసాలు చేయించొచ్చు. కానీ శ్రీదేవి లాంటి అందగత్తెని వెదికి పట్టుకుని, అతిలోక సుందరిని తీసుకొచ్చాం.. అని నమ్మించడమే అశ్వనీదత్ అండ్ కో ముందున్న అసలు సమస్య. మరి ఈ గండాన్ని ఆయన ఎలా దాటగలరో చూడాలి.