కొన్ని రోజులుగా రాజమౌళి Vs శ్రీదేవి ఎపిసోడ్ నిర్విరామంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఇష్యూపై ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. ‘బాహుబలి’ సమయంలో శివగామి పాత్రకు శ్రీదేవిని సంప్రదించడం, దానికి శ్రీదేవి ‘నో’ చెప్పడం తెలిసిన విషయాలే. శివగామి పాత్రని రమ్యకృష్ణ అద్భుతంగా చేసింది అని మెచ్చుకొంటూనే – శ్రీదేవి దురదృష్టానికి బాధపడిపోయారు చాలామంది. అయితే ఈ సానుభూతి శ్రీదేవి దగ్గరా చూపించడంతో… తన ఈగో హర్టయ్యింది. అందుకే `బాహుబలి` ప్రశ్న వచ్చేసరికి శ్రీదేవికి చిర్రెత్తుకొస్తోంది. ‘నేను వదిలేసిన వందలాది సినిమాల్లో అదొకటి.. దాన్ని పెద్ద మేటర్ చేస్తారెందుకు’ అంటూ రివర్స్‌లో ప్రశ్నిస్తోంది. సాధారణంగా ఎవరైనా సరే బాహుబలి లాంటి సినిమా మిస్సయితే.. ‘అయ్యో..’ అంటారు. ‘ఆ సినిమా మిస్ అయినందుకు ఫీల్ అవుతున్నా..’ అంటూ మొక్కుబడిగానైనా సరే సమాధానం చెబుతారు. కానీ శ్రీదేవి ఈ స్థాయిలో రివర్స్ అవుతుందని బాహుబలి టీమ్ కూడా ఊహించి ఉండదు. శ్రీదేవి ఈగో హర్టవ్వడానికి ఓ ప్రధాన కారణం ఉంది.
ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి బాహుబలిలోని శివగామి పాత్ర గురించి మాట్లాడుతూ శ్రీదేవి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ”శివగామి పాత్ర కోసం శ్రీదేవిని అనుకొన్న మాట నిజమే.. కానీ పారితోషికంతో భయపెట్టారామె. హోటల్ రూమ్స్ ఇన్ని కావాలి అంటూ కండీషన్లు పెట్టారు. ఫైట్ల టికెట్ల విషయంలో కూడా పేచీ జరిగింది” అన్నట్టు మాట్లాడాడు. అంతేకాదు… ”శ్రీదేవి ఈ పాత్ర చేయకపోవడం మా అదృష్టం” అన్నాడు. ఈ వీడియో శ్రీదేవి వరకూ వెళ్లింది. దాంతో.. శ్రీదేవి హర్టయ్యింది. శివగామి పాత్రని రమ్యకృష్ణ కంటే శ్రీదేవి బాగా చేస్తుందో లేదో తరువాతి విషయం. కాకపోతే.. ఈ పాత్రని శ్రీదేవి చేసుంటే, అప్పటి మైలేజీ కంటే… ఇంకాస్త ఎక్కువే వచ్చేది. శ్రీదేవి అన్ని షరతులు విధించినా విధించకపోయినా.. ఆ విషయాల్ని మీడియా ముందు చెప్పడం రాజమౌళి లాంటి దర్శకులకు భావ్యం కాదు. ”ఆ పాత్ర కు శ్రీదేవిని ఎంచుకొందామనుకొన్నాం, కానీ కుదర్లేదు” అని చెబితే సరిపోయేది. శ్రీదేవి గొంతమ్మ కోరికల్ని ఆమె అడిగినదానికంటే.. ఎక్కువ జోడించి చెప్పాడు. అంతటితో ఆగకుండా శ్రీదేవి నో చెప్పడమే అదృష్టం అంటూ శ్రీదేవి స్థాయిని తక్కువ చేసి మాట్లాడాడు. ఇదే శ్రీదేవికి కోపం తెప్పించి ఉండొచ్చు. అందుకే… ‘మామ్’ ప్రచార పర్వంలో ‘బాహుబలి’పై తన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ టోటల్ ఎపిసోడ్లో రాజమౌళిదే తప్పు అని తేలింది. కాబట్టి.. శ్రీదేవి అక్రోశంలో అర్థం ఉన్నట్టే.