శ్రీదేవిని తెలుగు తెరకు కథానాయికగా పరిచయం చేసింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ‘అతిలోక సుందరి’గా మలిచిందీ ఆయనే. రాఘవేంద్రరావు కమర్షియల్ సినిమాల వల్ల… శ్రీదేవి స్టార్‌గా మారింది. బాలీవుడ్లో `హిమ్మత్ వాలా`తో తొలి హిట్ ఇచ్చింది కూడా రాఘవేంద్రరావే. దర్శకేంద్రుడు వంద సినిమాలు పూర్తి చేస్తే.. అందులో శ్రీదేవి నటించిన సినిమాలే 24 ఉన్నాయి. దాన్ని బట్టి వీరిద్దరిదీ ఎలాంటి కాంబినేషనో అర్థం చేసుకోవొచ్చు. అయితే… ఆ పాతికో సినిమా కూడా పూర్తి చేయాలని రాఘవేంద్రరావుకి ఉండేది. అందుకే ‘మామ్’ ప్రచార వేడుకల్లో… ‘శ్రీదేవీ… నీతో మరో సినిమా చేయాలని వుంది… ఒప్పుకుంటావా’ అని అడిగారు కూడా. దానికి శ్రీదేవి కూడా ‘మీలాంటి వాళ్లు అవకాశం ఇవ్వడం ఇప్పటికీ ఓ గౌరవమే’ అని బదులిచ్చింది. అదేదో మాట వరుసకు అన్నమాటలు కాదు. నిజంగానే శ్రీదేవితో సినిమా చేయాలని రాఘవేంద్రరావు, అందులో నటించాలని శ్రీదేవి కూడా అనుకున్నార్ట. మోహన్‌బాబుతో ‘రావణ’ తెరకెక్కించాలని దర్శకేంద్రుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ‘రావణ’లో శ్రీదేవికి ఓ పాత్ర ఇవ్వాలని అనుకున్నార్ట. అది ‘శివగామి’లో రమ్యకృష్ణ పాత్రలా శక్తిమంతంగా ఉంటుందట. కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ రాఘవేంద్రరావు ‘రావణ’ తెరకెక్కిస్తే… అందులో శ్రీదేవి లేకుండా పోయిందే… అనే లోటు మాత్రం ఇటు ప్రేక్షకులకూ, అటు రాఘవేంద్రుడికీ వెంటాడుతూనే ఉంటుంది.