సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం మామూలే. వెండి తెరపై స్టార్డమ్ వెలగబెట్టిన వాళ్లంతా – తమ చివరి దశలో రాజకీయాలవైపు మళ్లాలనుకుంటారు. రజనీకాంత్, కమల్‌హాసన్ చేస్తోంది అదే. అయితే.. ఆ ఆలోచన అతిలోక సుందరి శ్రీదేవికి 30 ఏళ్ల క్రితమే వచ్చింది. అప్పట్లో శ్రీదేవి రాజకీయ రంగ ప్రవేశం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఎన్టీఆర్ రాజకీయాల్లో చేరి… విజృంభిస్తున్న రోజుల్లో శ్రీదేవికి కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఉండేది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో శ్రీదేవి స్వయంగా చెప్పింది. ”నేను రాజకీయాల్లోకి రావాలన్నది అమ్మానాన్నల కోరిక. వాళ్లు ఏం కోరుకున్నా కూతురిగా తీర్చడం నా బాధ్యత. నా గురించి, నా శక్తి గురించి నాకంటే వాళ్లకే బాగా తెలుసు” అని ముఫ్పయి ఏళ్ల క్రితమే చెప్పింది శ్రీదేవి. కానీ… ఆ తరవాత అలాంటి ప్రయత్నాలేం చేయలేదు. బహుశా…. సినిమాలు వదిలి, రాజకీయాల్లోకి రావడానికి శ్రీదేవి బాగా సంచయించి ఉంటుంది. పెళ్లయ్యాక, ఇద్దరు పిల్లలు పుట్టాక పూర్తిగా సినిమాలకే దూరమైంది శ్రీదేవి. అలాంటి సమయంలో రాజకీయాల గురించి ఏం ఆలోచిస్తుంది? అందుకే శ్రీదేవిని రాజకీయ నాయకురాలిగా చూడలేకపోయారు ఆవిడ అభిమానులు.