కొన్ని కథలు మారవు. మార్చలేం. యుగాలు మారినా, తరాలు మారినా – అవే కథలు. అవే వ్యధలు. ప్రేమకథల్లో కొన్ని ఫార్ములాలున్నాయి. ధనిక – పేద ప్రేమ, కులాంతర ప్రేమ.. వగైరా వగైరా. ఇప్పటి దర్శకులు కూడా అవే ఫార్ములాల్ని నమ్ముకుంటున్నారు. అయితే.. ఫార్ములా అదే అయినా – అందులోనూ వైవిధ్యం చూపించినోళ్లదే గెలుపు. `శ్రీదేవి సోడా సెంటర్` కూడా.. కులంతో ఏర్పడ్డ ఓ ఎడబాటే. ఆమె.. ఓ కులం తక్కువోడ్ని ప్రేమిస్తుంది. సమాజం ఊరుకుందా, పరువు నిలబడిందా, కులం కూలబడిందా? వీటి మధ్య నలిగిన ప్రేమ కథ… ఏ తీరానికి చేరింది?
సూరిబాబు (సుధీర్ బాబు) ఊర్లో లైటింగ్ సెట్ చేస్తుంటాడు. మంచోడు. కానీ దూకుడెక్కువ. శ్రీదేవి (ఆనంది)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కాకపోతే… వాళ్లది అప్పర్ క్యాస్ట్. శ్రీదేవి కూడా సూరిబాబుని ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కేవలం `నీది తక్కువ కులం – నాది ఎక్కువ కులం` దగ్గరే ఆగిపోతుంది. తండ్రి (నరేష్)ని కాదని శ్రీదేవి ఏం చేయదు. ఆ తండ్రికి కూడా.. శ్రీదేవంటే వల్లమాలిన ప్రేమ. అయితే ఊర్లో జరిగిన గొడవల వల్ల. సూరి జైలు పాలవుతాడు. జైలు నుంచి బయటకు వచ్చాక.. శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సూరిబాబు జైలు నుంచి కూడా వస్తాడు. బయటకు వచ్చాక కథంతా మారిపోతుంది. సూరిబాబు బయటకు వచ్చాక… తనకెలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? శ్రీదేవి ఏమైంది? అసలు ఆ ఊర్లో జరిగిన గొడవలేంటి? అనేది మిగిలిన కథ.
ప్రేమకథకు సంఘర్షణ చాలా అవసరం. కులం వల్ల వచ్చిన సంఘర్షణ ఇది. ఇలాంటి కథలు చాలా చూశాం. ఈమధ్య మరీ ఎక్కువయ్యాయి. పరువు హత్యల ఉదంతాల్ని దాదాపు ప్రతీరోజూ వింటుంన్నాం. చూస్తున్నాం. ఇదీ అలాంటి కథే. సూరిబాబు జీవితం, శ్రీదేవిని చూడడం ప్రేమలో పడడం.. శ్రీదేవి కూడా సూరిని ప్రేమించడం ఇలా – `శ్రీదేవి సోడా సెంటర్` యూత్ ఫుల్ గానే మొదలవుతుంది. ఊర్లో గొడవల వల్ల సూరి జైలు కెళ్లడంతో కథ వేడెక్కుతుంది. ఇంట్రవెల్ లో.. హీరో – హీరోయిన్ల ఎడబాటుతో పతాక స్థాయికి చేరుతుంది. అప్పటి వరకూ శ్రీదేవి సోడా సెంటర్… సగటు సినిమా సమీకరణాల మధ్యనే సాగుతుంది. ఎలాంటి కంప్లైంట్లూ ఉండవు. మరీ గొప్పగా లేకపోయినా – చూసేడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
సెకండాఫ్ లో కథ మరో రూటు పట్టింది. ఈ కథకు `కులం` అంటింది. సూరి – శ్రీదేవిలు ఊరి నుంచి పారిపోవడం, ఓచోట తల దాచుకోవడం, అక్కడ సన్నివేశాలూ.. వీటితో కథనంలో వేగం మందగించింది. ద్వితీయార్థంలో మొదటి సగభాగం – చాలా స్లో ఫేజ్ తో సాగుతుంది. క్లైమాక్స్ అయితే మరీ హెవీగా ఉంటుంది. దాదాపు 40 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ ఇది. ఈ తరహా క్లైమాక్స్ లు తమిళ సినిమాల్లో చూసేశాం కూడా. ఈమధ్య వచ్చిన ఓ వెబ్ సిరీస్ లోనూ.. ఈ తరహా క్లైమాక్సే కనిపించింది. తెలుగు ప్రేక్షకుల వరకూ ఇలాంటి పతాక దృశ్యాలు కొత్త కావొచ్చు. కాకపోతే… పక్క భాషలో సినిమాలు అలవాటు పడిన ప్రేక్షకులకు మాత్రం కాదు. సుదీర్ఘంగా సాగిన ఆయా సన్నివేశాలు సహనానికి కాస్త పరీక్ష పెడతాయి. ఈనాటి సమాజం ఇలానే ఉందా? అనే సందేహాన్ని వెళ్లగక్కుతాయి. కాకపోతే.. ఇలాంటి ఘటనలు ఈమధ్య ఒకటో రెండో జరిగాయి కదా..? అనుకున్న వాళ్లకు మాత్రం పరువు కోసం ఇలా క్రూరంగానూ ఆలోచించేవాళ్లు ఉన్నారన్న నిజాన్ని ఒళ్లు జలదరించేలా చెబుతాయి. కాస్త ఓవర్ ది బోర్డ్ వెళ్లినా ఆయా సన్నివేశాల్ని కరుణ కుమార్ ఎమోషనల్ గానే తీశాడని చెప్పాలి. ప్రధమార్థంలో నేటివిటీని కోల్పోకుండా కథని చెప్పిన దర్శకుడు.. పతాక సన్నివేశాల్లో మాత్రం ఓవర్ ది బోర్డ్ వెళ్లి ఆలోచించాడు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటివి చూస్తారా? లేదా? అని లెక్కలేసుకోకుండా తాను అనుకున్న పాయింట్ ని బలంగా చెప్పాడు. `కులం కులం అని ఊరేగావ్ కదా.. నీది తక్కువ కులమా? నాదా` అంటూ సూరిబాబు నిలదీసిన చోట.. హీరో కాదు. దర్శకుడే కనిపిస్తాడు.. వినిపిస్తాడు.
సుధీర్ బాబు మేకొవర్ బాగుంది. సహజంగా కనిపించడానికి తాపత్రయ పడ్డాడు. నా కండల గురించి మాట్లాడకండి.. మాట్లాడకండి.. అని చెబుతాడు గానీ, అవసరం అయిన దానికీ కాని దానికీ.. షర్టు విప్పితే కండల గురించే మాట్లాడాల్సివస్తుంది. కాకపోతే.. ఇది వరకటి సినిమాలకంటే.. కాస్త భిన్నమైన నటనని ప్రదర్శించాడు. ఆనందిని అందంగా ఉంది. తనకీ ఇక నుంచి మంచి పాత్రలు దక్కొచ్చు. పతాక సన్నివేశాలకు ముందు తన నటన మెచ్చుకోదగినది. నరేష్‌లోని సిన్సియర్ నటుడ్ని మరోసారి చూసే అవకాశం దక్కింది. విలన్ గా నటించిన పాత్రధారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలీదు గానీ, ఆ పాత్రకు.. రఘ కుంచెతో డబ్బింగ్ చెప్పించారు. అలవాటైన గొంతు కాబట్టి.. తెరపై ఎవరు ఉన్నా. ప్రేక్షకులకు రఘు కుంచెనే కనిపించాడు. ఆ పాత్రేదో.. రఘు కుంచెతోనే వేయించేస్తే బాగుండేది. రఘుబాబు, సత్యం రాజేష్లకూ మంచి పాత్రలు దక్కాయి.
కరుణ కుమార్ ఓ జాతి గొంతుకని బలంగా వినిపించాలని తాపత్రయపడుతున్న దర్శకుడు. తన భావజాలం ఎలాంటిదో పలాసతోనే అర్థమైంది. రొటీన్ కథనే ఎంచుకున్నా – సంభాషణల్లో తన బలమెంతో చూపించాడు. `నా జీవితం సముద్రమంత.. అందులో ఉప్పంతా నా దరిద్రం`, `పెద్దోళ్లంటే ముద్ద పెట్టాలి. చేతిలో ముద్ద లాగేసుకోకూడదు` లాంటి డైలాగుల్లో తను కనిపిస్తాడు. కెమెరాపనితనం, మణిశర్మ నేపథ్య సంగీతం… ఇవన్నీ సన్నివేశాలకు బలం తీసుకొచ్చాయి. ఒకటో సన్నివేశం నుంచి.. చివరి వరకూ దర్శకుడు కేవలం కథే చెప్పాడు. దాన్ని దాటి పోలేదు. కానీ ఆ చెప్పే విషయంలో కాస్త సాగదీత ఉంది. దాన్ని భరించాలి.
ఫినిషింగ్ టచ్: గొంతుతో గోళీక్కాయ
రేటింగ్: 2.5