ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరు ధర్మాన ప్రసాదరావు. చదివింది ఇంటరే అయినా ఇంటలెక్చువల్ ప్రసంగాలిస్తారని పేరు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓడిపోతూ.. గెలుస్తూ వస్తున్న ఆయన ఈ సారి మంత్రిగా మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సీఎం జగన్ రెడ్డిని బతిమాలి అయినా సరే ఈ సారి పోటీ చేయకుండా ఉండాలని అనుకుంటున్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం.. మీరే పోటీ చేయాలని అంటున్నారట. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.
గెలిచిన ప్రతీ సారి స్వల్ప తేడాతోనే గెలుస్తున్న ధర్మాన
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి మరింత భిన్నం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. గత నాలుగు ఎన్నికల్లో మూడు సార్లు ఆయన విజయం సాధించారు. కానీ ఎప్పుడూ ఆయన మెజార్టీ పది వేల ఓట్ల దరి దాపుల్లోకి రాలేదు. గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేన పార్టీకి ఏడున్నర వేల ఓట్లు వచ్చాయి. జనసేన ఓట్లు చీల్చబట్టి గత ఎన్నికల్లో ధర్మాన బయటపడ్డారు. లేకపోతే వరుసగా రెండో సారి ఓడిపోయేవారు. కానీ జనసేన పుణ్యమా అని ఆయన గెలవడతో పాటు రెండో టర్మ్ లో అయినా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రజల్ని రెచ్చగొట్టాలని చేసిన ప్రయత్నాలు ఫెయిల్
విశాఖ రాజధాని విషయంలో ప్రజల్ని రెచ్చగొట్టాలని ధర్మాన చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత టీడీపీకి ఓటు వేస్తే ఏదో జరిగిపోతుందని ఓటర్లను భయపెట్టేలా మాట్లాడుతున్నారు. కానీ అవి రివర్స్ లో ప్రజల్లోకి వెళ్తున్నాయి. రోడ్లు వేయకపోయినా పరవాలేదన్నట్లుగా ఆయన చేసిన కామెంట్లు కూడా నివ్వెర పరిచాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వం చాలా గడ్డు పరిస్థితుల్లో ఉందన్న అభిప్రాయాన్ని ఆయన కల్పిస్తున్నారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
సొంత వర్గాలను దూరం చేసుకున్న వైనం
వివిధ సామాజికవర్గాలను తన వైపు తిప్పుకునేందుకు ధర్మాన చేసిన ప్రయత్నాలు రివర్స్ అయ్యాయి. కళింగకోమట్లు తనకు ఎప్పుడూ పూర్తిస్థాయిలో ఓట్లే యడం లేదని భావించిన ధర్మాన ఇటీవల వారి మనసు గెలుచు కోవడానికి ప్రయత్నించారు. కానీ కళింగకోమట్లకు ఎన్నికల ముందు జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదన్న విమర్శలు ఉన్నాయి. 2019లో ధర్మాన గెలిచిన తరువాత మంత్రి పదవి దక్కనంత వరకు ఆయన మీద ప్రజలకు సానుభూతి ఉండేది. ప్రస్తుతం అదీ కనిపించడం లేదు. ధర్మాన కూడా 2024లో గెలిచే పరిస్థితి లేదని భావించారో ఏమో అందరినీ దూరం పెడుతూ వస్తున్నారు. ఆయన వ్యవహారశైలిని కేడర్ జీర్ణించుకోలేకపోతుంది.
నియోజకవర్గం అంతా తిరుగుతున్న టీడీపీ అభ్యర్థి లక్ష్మిదేవి
తెలుగుదేశం పార్టీ తరపున గుండా ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ దేవి పార్టీని బలోపేతం చేయడం కోసం నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. 2014 ఎన్నికల్లో ధర్మానపై గుండా లక్ష్మిదేవి గెలిచారు . గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడంతో ఓడిపోయారన్న సానుభూతి ఉంది. జనసేన నుంచి గత ఎన్నికల్లో కోరాడ సర్వేశ్వరరావు పోటీ చేయగా.. ఆ తర్వాత పెద్దగా ఇటు వైపు చూడలేదు. ఈ మధ్యే మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జనసేన పొత్తు, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి గెలవడం కష్టమన్న అభిప్రాయానికి ధర్మాన వచ్చేశారని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది.