తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితా గురువారం విడుదల చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలలో మొదటి విడతలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాలవలస, రాజాం నియోజవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండవ జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కేవలం నరసన్నపేట అభ్యర్థిని మాత్రమే ప్రకటించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బగ్గు రమణమూర్తి వైపే పార్టీ అధినేత మొగ్గుచూపుతూ అతనికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఖరారు చేశారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మరో ఐదు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ పెరుగుతోంది. రెండో జాబితాలో కూడా తమ పేర్లు ప్రకటించకపోవడంపై సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పలాస నియోజకవర్గ ఇన్చార్జ్ గౌతు శిరీష, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ కలమట వెంకటరమణ తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు.
పెండింగ్ ఉన్న ఐదు నియోజకవర్గాల్లో జనసేనకు కేటాయించే సీట్లు అంశంపై స్పష్టత రాలేదు. శ్రీకాకుళం బీజేపీకి కేటాఇస్తారని అంటున్నారు. జనసేనకు కూడా ఓ సీటు కేటాయించే అవకాశం ఉంది. ఈ ఐదు సీట్లలో రెండు మిత్రపక్షాలకు కేటాయించే అవకాశం ఉండటంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి రెండో జాబితాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో అభ్యర్థులు ప్రకటించకపోవడంతో ఆశావహులు ప్రచారంలోకి దిగలేకపోతున్నారు.