టెంపర్‌లో ఓ డైలాగ్ ఉంది. `మీరు మారిపోయారు సార్.. మారిపోయారు` అంటూ పోసాని ఎన్టీఆర్‌తో అంటాడు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలని చూసినా అదే అనాలనిపిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో, ముకుందా లాంటి క్లాస్ టచ్ ఉన్న సినిమాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పట్టేస్తారాయన. దాంతో ఆయనపై క్లాస్ ముద్ర పడింది. అయితే ఇప్పుడు ఆ ఛట్రం నుంచి పూర్తిగా బయటకు వచ్చే సినిమా తీశారు. అదే.. `పెదకాపు`. గోదావరి జిల్లాల్లోని రాజకీయ నేపథ్యాల ఇతివృత్తంగా సాగే కథ ఇది. పూర్తిగా పొలిటికల్ డ్రామా. ముకుందలో కూడా కాస్త పొలిటికల్ డ్రామా కనిపిస్తుంది. కాకపోతే.. దాంట్లో ప్రేమ కథ ఎక్కువగా డామినేట్ చేసింది. పొలిటికల్ స్టోరీ కూడా.. క్లాస్ టచ్‌తోనే చెప్పాడు శ్రీకాంత్ అడ్డాల.
పెద కాపు పరిస్థితి వేరు. ఈ సినిమాని రా అండ్ రస్టిక్ గా రూపొందించాడు శ్రీకాంత్ అడ్డాల. టీజర్ చూస్తేనే ఆ విషయం తెలిసిపోతోంది. సినిమా పూర్తయ్యింది. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఈమధ్య కొంతమందికి చూపించారు కూడా. ఈ సినిమా చూసినవాళ్లంతా శ్రీకాంత్ అడ్డాలలోని మార్పు చూసి ఆశ్చర్యపోయారట. యాక్షన్‌కి పెద్ద పీట వేసిన కొన్ని సన్నివేశాలు మరీ ఒళ్లు జలదరించేలా ఉన్నాయని తెలుస్తోంది. రక్తం, హింస… ఇవి రెండూ కనిపించాయట. శ్రీకాంత్ అడ్డాలలోని కొత్త కోణం ఈ సినిమాలో చూస్తారని ఇన్ సైడ్ వర్గాల టాక్. అన్నట్టు ఈ కథని రెండు భాగాలుగా విడగొట్టారు. రెండు భాగాల షూటింగ్ పూర్తయినట్టే. మొత్తంగా రూ.45 కోట్ల బడ్జెట్ తేలిందట. ఓ కొత్త కుర్రాడితో శ్రీకాంత్ అడ్డాల 45 కోట్ల సినిమా తీయగలిగాడంటే మామూలు విషయం కాదు. ట్రైలర్ త్వరలోనే రాబోతోంది. అన్నట్టు ఇందులో శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.