శ్రీకాంత్ అడ్డాల… ఫ్యామిలీ.. ఎమోషన్స్ కథలకు అడ్డా. అయితే అలాంటి దర్శకుడు `అసురన్` లాంటి కథని రీమేక్ చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే అంశమే. ఈ సినిమాతో శ్రీకాంత్ లోని మాస్ యాంగిల్ బయటపడుతుందని అనుకుంటున్నారంతా. మరి.. శ్రీకాంత్ ఏమంటున్నాడు? నారప్పపై తనకున్న అంచనాలేంటి? తన భవిష్యత్ ప్రణాళికలేంటి? ఈ విషయాలు తెలుసుకోవడానికి శ్రీకాంత్ అడ్డాలతో చేసిన చిట్ చాట్ ఇది.
మీరేంటి? మాస్ సినిమా ఏమిటి? అనుకుంటున్నారంతా?
– అలా అనుకోవడం నాక్కూడా బాగుంది… (నవ్వుతూ)
అసురన్ లో మీవైన మార్పులు చేశారా?
– మంచి సినిమాలకు కెలక్కూడదు. దాన్ని అలా ఉంచేయాలంతే. మన నేటివిటికి ఏం చేయాలో అది చేస్తే సరిపోతుంది. అసురన్ లోని ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఆ ఎమోషన్ మనకీ, మన ప్రేక్షకులకూ ఎలా వర్కవుట్ అవుతుంది? అనేది ఆలోచించానంతే.
ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాలనుకున్నార్ట…
– అవును.. 58 రోజుల కంటిన్యూ షెడ్యూల్ చేశాం. సురేష్ ప్రొడక్షన్స్ చరిత్రలోనే ఇంత పెద్ద షెడ్యూల్ లేదు. చివరి 5 రోజులూ మా వాళ్లు దండాలు పెట్టేశారు. `సెలవిచ్చేయండి సార్` అన్నారు. ఒళ్లు హూనాలైపోయాయి. మా ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఆ తరవాత అనుకోకుండా కరోనా వచ్చింది. దాంతో… సెలవలు ఇవ్వాల్సివచ్చింది. ఆ గ్యాప్ వల్ల మాకు మంచే జరిగింది.
అసలు ఈ రీమేక్ మీ చేతికి ఎలా వచ్చింది?
– అసురన్ చేయాలని సురేష్ బాబు ఫిక్సయ్యారు. అప్పటికి నేను వేరే కథలో ఉన్నా. అనుకోకుండా అసురన్ సినిమా చూశా. చూసిన వెంటనే చేయాలనిపించింది. వేరే పనిమీద.. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసుకి వెళ్లినప్పుడు సురేష్ బాబు కనిపించారు. `అసురన్ రీమేక్ చేస్తున్నార్ట. దర్శకుడిగా ఎవరైనా ఫిక్సయ్యారా` అని అడిగా. `అవకాశం ఉంటే నేనే చేసేస్తా` అని చెప్పడంతో సురేష్ బాబు ఓకే అనేశారు.
ఇప్పటి వరకూ కథలతోనే సినిమా తీశారు.. తొలిసారి రీమేక్ కథ ఎంచుకున్నారు. రెండింటిలో దేంట్లో ఎక్కువ సౌలభ్యాలున్నాయి?
– రీమేక్ లో కథ ముందే రెడీ అయిపోతుంది కాబట్టి.. మా పని సులభం అవుతుంది. కానీ.. ఓసారి జరిగిన అద్భుతాన్ని రీక్రియేట్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఉన్నది ఉన్నట్టు తీస్తే.. కొత్తగా చూపించలేదంటారు. మార్పులు చేస్తే… `ఒరిజినల్ తీయడానికి పోయేకాలం ఏమిటి? ఉన్నది తీయొచ్చు కదా` అంటారు. అదే పెద్ద సవాల్. మంచి కంటెంట్ ఎక్కడైనా ఉండొచ్చు. దాన్ని పట్టుకోవాలంతే. దాన్ని ఎంత వరకూ ఎడాప్ట్ చేసుకున్నాం అన్నది ముఖ్యం.
అసురన్ రీమేక్ లో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన అంశాలేంటి?
– ఛాలెంజింగ్ గా కాదు. ఇష్టంగా అనిపించింది. ఇలాంటి కథని, ఇలాంటి ఎమోషన్ నీ చెప్పడం చాలా ఇష్టంగా అనిపించింది. ఇలాంటి కథ రాసుకోవవడమే గొప్ప. వెట్రిమారన్ చాలా గ్రేట్. ఈ సందర్భంగా ఆయన కు నేను చాలా థ్యాంక్స్ చెబుతున్నా. ఈ కథ ఎంత రియలిస్టిక్ గా ఉంటుందో.. అంత కమర్షియల్ గా ఉంటుంది. దాన్ని మెల్ట్ చేయడం చాలా కష్టం
ఓటీటీలో విడుదల చేయడం పట్ల ఓ దర్శకుడిగా, సినీ అభిమానిగా మీ ఫీలింగ్ ఏమిటి?
– చాలా నిరాశ పడ్డా. ఎవరూ ఇది ఓటీటీ సినిమా అనుకోలేదు. థియేటర్లో సినిమా అనుకున్నాం. అలా అనుకునే తీశాం. పెద్ద సినిమాని థియేటర్లో చూడడమే బాగుంటుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. సడన్ గా ఓ రోజు.. `మనం ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నాం` అన్నారు. దాన్ని అర్థం చేసుకోవడానికి రెండు రోజులు పట్టింది. ప్రస్తుతం వాతావరణం బాలేదు. పరిస్థితుల్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. తమిళ నిర్మాత దాను గారు తీసుకున్న నిర్ణయం ఇది. మేం ఏం చేయలేం.
ప్రియమణిని తీసుకోవాలన్న ఆలోచన మీదేనా?
– అవును. అసురన్ చూసినప్పుడే.. ప్రియమణి ని తీసుకోవాలనిపించింది. ముగ్గురు పిల్లల తల్లిలా తను కరెక్ట్ గా అనిపించింది. తను చాలా బాగా చేసింది. వెంకటేష్ గారైతే చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. చాలాసార్లు ఏడిపించేస్తారాయన. తమిళంలో ఈ సినిమా చేసిన ధనుష్కి జాతీయ అవార్డు వచ్చింది. వెంకీ అందుకు ఏమాత్రం తీసిపోని నటన ప్రదర్శించారు.
మీ కెరీర్ చాలా స్లోగా నడుస్తోంది. దానికి కారణం ఇది వరకు వచ్చిన ఫెయిల్యూరా?
– ఫెయిల్యూర్.. ఫెయిల్యూర్ అంతే. సినిమా ఫెయిల్ అవుతుంది. నేను ఫెయిల్ అవలేదు కదా. మనం ఎక్కడ తప్పు చేశాం..? అన్నది ఎనాలిసిస్ చేసుకోవాలి. నేను స్వతహాగా చాలా స్లో. దానికి తోడు.. కరోనా వచ్చింది. కాబట్టి.. నా కెరీర్ కూడా స్లో అయ్యింది.
మీ సినిమాల్లో గోదావరి యాస వినిపిస్తుంది. తొలిసారి అనంతపురం బ్యాక్ డ్రాప్ లో సినిమా తీశారు. అక్కడి యాస అర్థం చేసుకోవడానికి, దాన్ని సినిమాల్లో చూపించడానికి ఏం కసరత్తు చేశారు?
– తొలి షెడ్యూల. అనంతపురంలో జరిగింది. షూటింగ్ స్పాట్ లో ఓ అబ్బాయి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. తను అనంతపురం యాస్ ఖంగు ఖంగున మాట్లాడుతున్నాడు. అతని ఫోన్ నెంబర్ పట్టుకుని.. హైదరాబాద్ తీసుకొచ్చాం. డైలాగుల విషయంలో తన సహాయం తీసుకున్నాం. స్క్రిప్టు కో ఆర్డినేషన్లో… సత్యానంద్ గారి హ్యాండ్ ఉంది.
మీకిష్టమైన రచయిత గణేష్ పాత్రోని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఉందా?
– ఉందండీ. సీతమ్మ వాకిట్లో సినిమా చేసినప్పుడు ప్రకాష్ రాజ్ పర్సెనప్షన్ ఏమిటన్న విషయంలో చాలా గందరగోళంలో ఉన్నా. అప్పుడు గణేష్ పాత్రో గారు గుర్తొచ్చారు, ఆయన్ని బతిమాలి.. హైదరాబాద్ తీసుకొచ్చా. ఆయన అనుభవం చాలా ఉపయోగపడింది. ఆయన్ని నేను మిస్ అవుతున్నా.
`అన్నాయ్` అనే కథ ఉందని.. దాన్ని 3 భాగాలుగా తీస్తారని వార్తలొస్తున్నాయి.. నిజమేనా?
– అవునండీ. అది చాలా పెద్ద సినిమా. అలాంటి సినిమాలకు ఇదే కరెక్ట్ టైమ్ అనిపించింది. మార్కెట్ పెరిగింది కదా. అది కూడా యాక్షన్ జోనర్ లో సాగుతుంది. అదో పిరియాడికల్ డ్రామా. అలాగని కాస్ట్యూమ్ డ్రామా కాదు. ఎయిటీస్ నేపథ్యంలో సాగే కథ. కాస్త టైమ్ పట్టినా.. ఈ సినిమానే తీస్తా.