ఓకే కథని రెండు భాగాలుగా విడగొట్టి పార్ట్ 1, పార్ట్ 2 అంటూ రెండు సినిమాలు చేయడం దక్షిణాది కి బాగా అలవాటైంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, కబ్జ.. అలాంటి కథలే. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కూడా అదే ఫార్మెట్లోకి వెళ్లాడు. నారప్ప తరవాత శ్రీకాంత్ అడ్డాల నుంచి సినిమా ఏం రాలేదు. అయితే ఆయన ఖాళీగా లేడు. ఓ కొత్త హీరోతో సినిమా చేస్తున్నాడు. జయ జానకీ నాయక లాంటి సినిమాల్ని అందించిన మిరియాల రవీందర్ రెడ్ది ఇంటి నుంచి వచ్చిన కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ.. ఓ సినిమా తీస్తున్నాడు. దీనికి `పెద కాపు` అనే పేరు పరిశీలనలో ఉంది. కోనసీమ రాజకీయాలు, అక్కడ వర్గ పోరాటాలు, కులాల ఆధిపత్యాల చుట్టూ తిరిగే కథ ఇది. 1980 బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. ఈ కథని రెండు భాగాలుగా విడగొట్టి, పార్ట్ 1, పార్ట్ 2లుగా విడుదల చేస్తున్నట్టు సమాచారం. నిజానికి రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన ముందు లేదు. ఫుటేజ్ బాగా పెద్దది రావడంతో.. ఈ కథ కాస్త.. రెండు సినిమాలైపోయింది. తొలి భాగానికి, రెండో భాగానికీ ఆరు నెలల గ్యాప్ ఉంటుందట. షూటింట్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసి, టైటిల్ ఎనౌన్స్ చేసి, ప్రచారం కూడా మొదలెట్టాలన్న ఆలోచనలో ఉంది చిత్రబృందం.