శ్రీకాంత్ అడ్డాల నుంచి వస్తున్న సినిమా… పెదకాపు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడగొట్టారు. పార్ట్ 1 ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పార్ట్ 2 జనవరి నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. అయితే ఈ కథకు పార్ట్ 3 కూడా ఉంది. ఇదో పొలిటికల్ డ్రామా. ఓ సామాన్యుడు రాజకీయాల్లోకి రావడమే కథాంశం. హీరో.. ఓ పార్టీలో జాయిన్ అయి, ఆ పార్టీ టికెట్ సంపాదించుకోవడంతో పార్ట్ 1 పూర్తవుతుంది. టికెట్ వచ్చిన తరవాత.. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం.. ఇదంతా పార్ట్ 2లో కనిపిస్తుంది. అతని పాలన ఎలా ఉంటుంది? ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాలేంటి? అనేది పార్ట్ 3లో చూపిస్తారు. మొత్తానికి శ్రీకాంత్ అడ్డాల చాలా పెద్ద స్కెచ్చే వేసినట్టు కనిపిస్తోంది. ఓ పొలిటికల్ డ్రామాని ఇలా మూడు ముక్కల్లో చెప్పడం ఇదే తొలిసారి. విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తొలి భాగానికే ఏకంగా రూ.45 కోట్లు అయ్యాయని టాక్. ఓ కొత్త హీరోపై.. ఇది రిస్కీ బడ్జెట్టే. కాకపోతే.. టీజర్, ట్రైలర్ హోరెత్తిస్తున్నాయి. కొత్త హీరో అయినా సరే.. సినిమా చూడాలన్న ఆసక్తిని కలిగిస్తున్నాయి. పైగా శ్రీకాంత్ అడ్డాల ఇమేజ్‌కి భిన్నమైన కథ ఇది. దాంతో మరింత ఫోకస్ పడింది. తన శైలిని వదిలి.. కొత్త కథ ఎలా చెబుతాడా? అని అంతా ఎదురు చూస్తున్నారు. పైగా శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా అవతారం ఎత్తుతున్నాడు. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.