ఈమధ్య శ్రీకాంత్ కాస్త జోరుగానే సినిమాలు చేస్తున్నాడు. హిట్లు లేకపోయినా.. శ్రీకాంత్‌కి అవకాశాలొస్తున్నాయి. ‘ఆపరేషన్ 2019’ ఈరోజే (శనివారం) విడుదలైంది. ‘తెలంగాణ దేవుడు’, ‘కోతల రాయుడు’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈలోగా మరో సినిమా ఒప్పుకున్నాడు. అదే ‘మార్షల్’. పేరు వినగానే.. ఇదేదో యాక్షన్ మూవీ అనుకుంటారేమో. ఇదో సైన్స్ ఫిక్షన్. ఇందులో శ్రీకాంత్ సైంటిస్ట్‌గా నటిస్తున్నాడు. జన్యు పరమైన ప్రయోగాలు చేసే శాస్త్రవేత్త పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో మరో యువ హీరో కూడా కనిపించనున్నాడట. అతనెవరన్నది త్వరలో తెలుస్తుంది. దర్శక నిర్మాతల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. అన్నట్టు ‘ఆపరేషన్ 2019’ కూడా ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా అచ్చంగా `ఆపరేషన్ దుర్యోధన`నే చూసినట్టు ఉందని విశ్లేషకులు తేల్చేశారు. శ్రీకాంత్ లాంటి కథానాయకులకు శాటిలైట్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. టీవీ ఛానళ్లు సినిమాల్ని కొనడం లేదు. డిజిటల్ రైట్స్ ఒక్కటే ఆధారం. అదృష్టవశాత్తూ డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు నాలుగు డబ్బులు చేతుల్లో పడుతున్నాయి. అందుకే శ్రీకాంత్ లాంటి కథానాయకులకు ఇలా సినిమాలు వస్తున్నాయి. కానీ.. అదృష్టమే శ్రీకాంత్ వైపు ఉండడం లేదు.