శ్రీకాంత్ కెరీర్ని మలుపు తిప్పిన చిత్రాల్లో `పెళ్లి సందడి` ఒకటి. ఇప్పుడు అదే టైటిల్ తో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఓ సినిమా చేస్తున్నాడు. పెళ్లి సందడి తో మ్యాజిక్ చేసిన రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండడం విశేషం. ఆయన శిష్యురాలు గౌరి దర్శకురాలిగా పరిచయం అవుతోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో శ్రీకాంత్ అతిథి పాత్రలో మెరవబోతున్నారని సమాచారం. కథని మలుపుతిప్పే పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తారని, ఆయన ఉండేది కొద్దిసేపే అయినా, ఆ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేములో కనిపించడం అనేది ఎప్పటికైనా విశేషమే. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.