ఇటీవల ‘పొట్టేల్’ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్లపై ఘాటుగా విమర్శలు గుప్పించారు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్. ఆయన వాడిన భాష దారుణాతి దారుణంగా ఉంది. కనీసం రాయడానికి కూడా వీల్లేని పదాలవి. రివ్యూ రైటర్లపై చాలామంది చాలా విధాలుగా కామెంట్లు చేశారు కానీ, ఇంత నీచమైన భాష మరెవరూ వాడలేదు. దాంతో జర్నలిస్టు సంఘాలన్నీ శ్రీకాంత్ అయ్యంగార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశాయి. అప్పటి వరకూ శ్రీకాంత్ అయ్యంగార్ పాల్గొనే ప్రెస్ మీట్లను కవర్ చేయకూడదని నిర్ణయించుకొన్నాయి. శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని ‘మా’కు ఓ లేఖ రాశాయి.
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అయ్యంగార్ ఓ వీడియో వదిలారు. ”ఇటీవల రివ్యూ రైటర్లపై కొన్ని మాటలు మాట్లాడాను. కొన్ని విషయాల్లో బాధ కలిగించాను. త్వరలో మీ అందరికి కరెక్ట్ విషయాలపై బేషరతు క్షమాపణ ఇవ్వబోతున్నా. దయచేసి వేచి ఉండండి” అంటూ ఆ వీడియోలే పేర్కొన్నారు. ‘కరెక్ట్ విషయాలపై’ అనేదే శ్రీకాంత్ వేసిన మెలిక. అంటే.. ఈసారి కూడా ఆయన ఏదో విషయంపై కాంట్రవర్సీ చేయబోతున్నారని, క్షమాపణలు చెబుతూనే, మరో కొత్త వివాదం సృష్టించబోతున్నారన్న సంగతి అర్థమవుతోంది.
పొట్టేల్ సక్సెస్ మీట్ తరవాత.. క్షమాపణల విషయంలో చిత్రసీమకు చెందిన చాలామంది నటీనటులు, నిర్మాతలు అయ్యంగార్‌కు ఫోన్ చేసి వివరణ అడిగినట్టు తెలుస్తోంది. ‘ఎందుకొచ్చిన గొడవ.. సారీ చెప్పేయ్’ అని సలహాలు కూడా ఇచ్చారని సమాచారం. అయితే.. శ్రీకాంత్ అయ్యంగార్ వాళ్లతోనూ వెటకారంగానే మాట్లాడినట్టు, క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని, తను అలాంటి భాష వాడడంలో ఎలాంటి తప్పూ లేదని కుండ బద్దలు కొట్టేశారట. అంతలోనే ఈ వీడియో వదిలారు. ఎలాంటి గొడవా లేకుండా ‘సారీ’ చెప్పేస్తే ఈ వివాదం సద్దుమణిగిపోతుంది. లేదంటే ఇంకొంత కాలం ఇలానే రగులుతూనే ఉంటుంది.