తన భార్య ఊహకు విడాకులు ఇస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని హీరో శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను…!? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు.” అని మండి పడ్డారు.
”ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూ ట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుంది . ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి ” అని కోరారు శ్రీకాంత్.