శ్రీకాంత్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సినిమా తారలు ఎప్పుడు క్రికెట్ ఆడినా.. అందులో శ్రీకాంత్ పేరు కచ్చితంగా ఉంటుంది. సీసీఎల్‌లో కూడా శ్రీకాంత్ ఆడాడు. తన తనయుడు రోషన్‌ని కూడా అలానే క్రికెటర్ని చేద్దామనుకొన్నాడట. కానీ.. ఇప్పుడు తనలా హీరో అయిపోతున్నాడంటున్నాడు శ్రీకాంత్. ‘నిర్మలా కాన్వెంట్’ ఈనెల 16న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ”సినిమా కొద్ది కొద్దిగాచూశా. ఫైనల్ కాపీ మాత్రం చూడలేదు. కానీ రోషన్ చాలా బాగా చేశాడనిపించింది. నా తొలి సినిమా పీపుల్స్ ఎన్కౌంటర్ కంటే బాగా చేశాడు. మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా బాగా మాట్లాడాడు. నేనైతే ఆ రేంజులో మాట్లాడడానికి చాలా కాలం పట్టింది. మైకు ఇస్తే పారిపోయేవాడ్ని. మా అబ్బాయి ఆ రేంజులో మాట్లాడతాడని అనుకోలేదు. అసలు వాడు సినిమాల్లోకి వస్తాడనుకోలేదు. క్రికెటర్ని చేద్దామనుకొన్నా. రంజీ ట్రోఫీకి వెళ్లేవాడే. కానీ సడన్‌గా తన దృష్టి సినిమాలవైపు మళ్లింది. నిర్మలా కాన్వెంట్ ఏ రేంజులో ఆడినా సరే.. వాడికి కనీసం రెండేళ్లు బ్రేక్ ఇవ్వాలనుకొంటున్నా. చదువు పూర్తయ్యాకే మళ్లీ సినిమాల్లో నటిస్తాడ”న్నాడు.
తనయుడి నటనపై ఊహ కూడా స్పందించింది. ”ట్రైలర్ చూడగానే బాగా నచ్చింది. నేను కూడా నటినే. సినిమా పరిశ్రమ గురించి బాగా తెలుసు. అయినప్పటికీ వాడ్ని స్క్రీన్‌పై చూడగానే ఉద్వేగంగా అనిపించింది. నాగార్జున గారితో కాంబినేషన్ సీన్లు చేసేటప్పుడు కాస్త కంగారు పడ్డాడు. కానీ.. తర్వాతర్వాత అలవాటైపోయింది” అంటున్నారామె. సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? అని అడిగితే అలాంటిదేం లేదని చెప్పుకొచ్చింది ఊహ.