తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
గత కొంతకాలంగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న శంకరమ్మ లోక్ సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరినా ఆయన పట్టించుకోకపోవడంతో పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. గతేడాది ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చి ఇవ్వకపోవడం శంకరమ్మను అసంతృప్తికి గురి చేసింది. అధికారంలోకి వచ్చాక అమరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శంకరమ్మ తాజాగా కాంగ్రెస్ లో చేరడంతో ఆమెకు ఏదైనా పదవి ఇస్తారా..? అనే చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ లో తనకు న్యాయం జరగలేదని అందుకే ఆ పార్టీని వీడినట్లు శంకరమ్మ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ లోక్సభ స్థానాలు గెలవడం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ లో చేరిన శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.